కనువిందు చేస్తున్న ‘గుంజన’ జలపాత ప్రాంతం

9 Apr, 2022 11:53 IST|Sakshi
గుంజన జలపాత జార

సాక్షి, రైల్వేకోడూరు : అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు మండలం మాధవరంపోడు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో గుంజన జలపాతం ఉంది. ఇది కొన్నేళ్లుగా ప్రకృతి ప్రేమికుల దృష్టి ఆకర్షిస్తోంది. ఇక్కడ ఎటువంటి సమయాల్లో కూడా నీరు ఇంకిపోయిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతుంటారు. ఈ ప్రాంతం బాలపల్లె రేంజ్‌ పరిధిలోకి వస్తుంది. ఆ రేంజ్‌ పరిధిలో 23 వేల ఎకరాలలో శేషాచలం అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో ఎంతో విలువైన, అరుదైన ఎర్రచందనం వృక్షాలు ఉన్నాయి.

         కొండల మద్య అందమైన జలపాతం

ఎలా వెళ్లాలంటే..
మండలంలోని ప్రధాన రహదారిపై ఉన్న మాధవరంపోడు నుంచి వాగేటికోన వద్ద వరకు వాహనాలు వెళ్తాయి. అక్కడి నుంచి ఒకటిన్నర కిలోమీటర్లు శేషాచలం అటవీ మార్గం మీదుగా గుంజన జలపాత జారకు కాలినడకన వెళ్లాలి. ఉదయం వెళ్లి అక్కడే వంటవార్పు చేసుకుంటారు. అక్కడ దొరికే చేపలు పట్టి, వండుకోవడం చేస్తూ ప్రకృతి ప్రేమికులు ఈ జలపాత అందాలు ఆస్వాదిస్తుంటారు. దీనితోపాటు విశాలమైన, ఎత్తయిన కొండలు, ఎత్తయిన ఎర్రచందనం వృక్షాలు పచ్చదనం పరుచుకుని ఉంటాయి. ఈ మార్గంలో వివిధ రకాల చెట్లు, పక్షులు చూపరులను ఇట్లే ఆకట్టుకుంటాయి.

      వంటావార్పు చేసుకుంటున్న ప్రకృతి ప్రేమికులు 

అటవీ అధికారుల అనుమతి తప్పనిసరి
ఎంతో విలువైన, అరుదైన ఎర్రచందనం వృక్షాలు ఉన్నందున, ఇక్కడ గత టీడీపీ ప్రభుత్వంలో భారీగా ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరగడంతో లోపలికి ఎవరినీ వెళ్లనివ్వరు. జలపాత జార వద్దకు వెళ్లాలంటే అటవీ శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి.

పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి
రైల్వేకోడూరు నుంచి 100 కిలోమీటర్ల మేర ఇటువంటి ప్రకృతి అందాలు.. గుంజన జలపాతం వంటి సుందరమైన ప్రాంతం ఎక్కడా లేదని.. ఈ ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా ప్రభుత్వం అభివృద్ధి చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తే అక్కడ అలరిస్తున్న జలపాతాలు, ప్రకృతి అందాలను కనులారా చూసే అవకాశం ప్రజలకు దొరకడంతోపాటు, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని వారు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు