చూడముచ్చటైన జలపాతాలు.. అబ్బురపరిచే వ్యూపాయింట్లు

27 Sep, 2022 15:47 IST|Sakshi
పార్కులో ఉన్న జలవిహార్‌లో హ్యాంగింగ్‌ బ్రిడ్జిపై నడుస్తున్న పర్యాటకులు

పిల్లలను ఆకర్షించే పార్కులు

ఆహ్లాదాన్ని పంచే బోటు షికారు

పర్యాటకులు సేదతీరేందుకు విశాలమైన తోటలు   

కనుచూపు మేర కనిపించే పచ్చని కొండలు.. జలజల జాలువారే జలపాతాలు.. అబ్బుర పరిచే వ్యూ పాయింట్లు... పిల్లలను ఆకర్షించే పార్కులు.. బోటు షికారు.. గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించే కళాఖండాలు.. పర్యాటకులను మురిపించి.. ఆహ్లాదపరిచే ప్రదేశాలు.. పార్వతీపురం మన్యం జిల్లా సొంతం. ప్రపంచ పర్యాటక దినోత్సవం(సెప్టెంబర్‌ 27) సందర్భంగా మన్యం అందాలను ఓ సారి తిలకిద్దాం. 


సీతంపేట:
పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు... పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఆహ్లాదపరుస్తున్నాయి. పచ్చని కొండల మధ్య సాగిపోయే ప్రయాణం కొత్త అనుభూతినిస్తుంది. సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, పాచిపెంట మండలాల్లో ఉన్న 9 జలపాతాల వద్ద ఏడాది పొడవునా నీటి సవ్వడి కనిపిస్తుంది. సీతంపేట ఏజెన్సీ అందాలను గత రెండేళ్లలో 2,58,580 మంది పర్యాటకులు తిలకించారు. సీతంపేటలో గిరిజన మ్యూజియం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఆదిమ మానవుడి నుంచి నేటి వరకు మానవ జీవన చక్రం, గిరిజన ఆచార, సంప్రదాయాలు, పండగలు, ప్రపంచ దేశాల ఆదిమ తెగల బొమ్మలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. 


మెట్టుగూడ, సున్నపుగెడ్డ, ఆడలి, జగతపల్లి వ్యూపాయింట్లు చూసేవారికి కనువిందు కలిగిస్తాయి. కొత్తలోకాన్ని చూపిస్తాయి. మెట్టుగూడ జలపాతాన్ని ఇటీవల కాలంలో సుందరంగా తీర్చిదిద్దారు. పర్యాటకుల కోసం పగోడాలు, ఉండడానికి వీలుగా ఒక భవనం, ఇతర సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశారు. సున్నపుగెడ్డ, మల్లి, కొండాడ వంటి జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. జగతపల్లి వ్యూపాయింట్‌ వద్ద రీసార్ట్స్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆడలి వ్యూ పాయింట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. 


సీతంపేటలో ఎన్టీఆర్‌ అడ్వెంచర్‌పార్కును సుందరంగా తీర్చిదిద్దారు. దీనిలో భాగంగా జలవిహార్‌లో బోటు షికారు, ఆల్‌టర్న్‌ వెహికల్‌ వంటివి ఏర్పాటు చేశారు. వచ్చిన పర్యాటకులు వివిధ సాహస క్రీడల్లో పాల్గొనేందుకు జెయింట్‌వీల్, హ్యాంగింగ్‌ బ్రిడ్జి, జలవిహార్‌లో బోటుషికారు వంటివి ఉన్నాయి. ఇక్కడ నిర్మించిన 5డీ థియేటర్‌ పర్యాటకులను ఆకర్షిస్తోంది. కార్తీక మాసంలో ఈ ప్రదేశాలన్నీ వనసమారాధకులతో నిండిపోతాయి.  


పర్యాటక శాఖ ప్రతిపాదనలు ఇలా..  

తొటపల్లి రిజర్వాయర్‌ వద్ద సమగ్ర పర్యాటక అభివృద్ధికి సుంకి ప్రాంతంలో 22.18 ఎకరాల భూమి అవసరంగా గుర్తించారు. ఇక్కడ కార్తీకవనం, ఓపెన్‌ థియేటర్, ట్రైబుల్‌ మ్యూజియం, ట్రైబుల్‌ ఆర్ట్‌గ్యాలరీ అండ్‌ బజార్, హెలీప్యాడ్‌  వంటివి ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఉల్లిభద్ర ప్రాంతంలో 36 ఎకరాల్లో వైఎస్సార్‌ హార్టీకల్చర్‌ పెట్టాలన్న ప్రతిపాదన ఉంది. బోటింగ్‌ యాక్టివిటీ, రెస్టారెంట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్, స్పాసెంటర్, చల్లంనాయుడువలస వద్ద 3 ఎకరాల బర్డ్‌ శాంక్చూరీ వంటివి ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖ నిర్ణయించింది.  


మూడు రోప్‌వేలు...
 
సీతంపేట మండలం ఆడలి, జగతపల్లి వ్యూపాయింట్, చంద్రమ్మతల్లి గుడి వద్ద మూడు రోప్‌వేల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జగతపల్లి హిల్‌ రీసార్ట్‌ పనులు, గుమ్మలక్ష్మీపురం మండలంలో సవరకోటపాడు వద్ద హార్టికల్చర్‌ ఫారం పనులు చకచకా సాగుతున్నాయి. (క్లిక్: విశాఖ అందాలను చూసేలా స్కైటవర్‌.. 100 కోట్లతో స్విట్జర్లాండ్‌..)
  

పర్యాటకాభివృద్ధికి కృషి  

జిల్లాలో పర్యాటక ప్రదేశాలకు కొదవలేదు. వీటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. గతంతో పోలిస్తే ఇప్పుడు పర్యాటకుల తాకిడి పెరిగింది. పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది.  
– నారాయణరావు, జిల్లా పర్యాటకశాఖాధికారి  


పర్యాటక రంగానికి పెద్దపీట  

పర్యాటక రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మన్యం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న టూరిజం స్పాట్‌లను అభివృద్ధి చేశాం. మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాను. దీనిపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి చేస్తామని చెప్పారు.  
– విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే

మరిన్ని వార్తలు