సముద్ర తీరాల్లో టూరిజం రిసార్ట్స్

7 Dec, 2020 05:05 IST|Sakshi

శ్రీకాకుళం నుంచి నెల్లూరు మధ్య పెద్దఎత్తున నిర్మించేందుకు ప్రణాళిక

పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ వెల్లడి

సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు వరకు సముద్ర తీరం వెంబడి పెద్దఎత్తున రిసార్ట్స్‌ నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ తెలిపారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. రిసార్ట్స్‌ నిర్మాణానికి ప్రభుత్వ భూములను గుర్తించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయా జిల్లాల కలెక్టర్లను కోరామన్నారు. పర్యాటక రంగానికి మన రాష్ట్రం పర్యాయ పదం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

కొత్త టూరిజం పాలసీ రూపొందించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారన్నారు. పర్యాటక రంగానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నియంత్రణ లేదని,  అందువల్ల ఈ రంగంలో ఉన్న టూర్‌ ఆపరేటర్లు, హోటళ్లు, వాటిలో అందుబాటులో ఉన్న గదులు, టూరిజం అడ్వెంచర్‌కు సంబంధించిన ప్రదేశాలు, సదుపాయాలు వంటివన్నీ రిజిస్ట్రేషన్‌ చేస్తున్నామని వివరించారు. 12 ప్రాంతాల్లో స్టార్‌ సదుపాయాలతో కూడిన రిసార్టులు, హోటళ్లు అభివృద్ధి చేస్తున్నామని, వాటర్‌ టూరిజం, ఎకో టూరిజం, బీచ్‌ టూరిజం, టెంపుల్‌ టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు.

తెలుగు వంటకాలకు గుర్తింపు కోసం ఫుడ్‌ ఫెస్టివల్‌
తెలుగు వంటకాలకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చేందుకు ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహించనున్నామని, శాఖాహార, మాంసాహార వంటకాలను ప్రజలకు పరిచయం చేస్తామని చెప్పారు. పర్యాటకుల భద్రత కోసం ప్రభుత్వం తొలిసారిగా రాష్ట్రంలో 9 కంట్రోల్‌ రూమ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పారు. 

మరిన్ని వార్తలు