ఉల్లి రైతు 'ధర'హాసం

14 Oct, 2020 03:43 IST|Sakshi

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా అధిక వర్షాలకు పంట దెబ్బతినడంతో హోల్‌సేల్‌ మార్కెట్‌కు వస్తున్న ఉల్లిని వ్యాపారులు ఎగరేసుకుపోతున్నారు. ముఖ్యంగా నాణ్యమైన ఉల్లికి గిరాకీ మరింత పెరిగింది. సోమ, మంగళవారాల్లో కర్నూలు మార్కెట్‌లో నాణ్యమైన ఉల్లికి క్వింటాలుకు రూ.3,830 ధర పలికింది. తాడేపల్లిగూడెంలోనూ ఇదే పరిస్థితి. రెండు మార్కెట్లలోనూ సగటు ధర రూ.2,000 వరకు ఉంది. ఈ ధర రూ.1,100 స్థాయి నుంచి రూ.2,000కు పెరగడంతో.. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో ఖరీఫ్, రబీల్లో 40 వేల హెక్టార్ల వరకు ఉల్లి సాగవుతోంది. ఒక్క కర్నూలులోనే 32 వేల హెక్టార్లలో ఉల్లి సాగవుతోంది. సాగుకు పరిస్థితులన్నీ సానుకూలంగా ఉంటే ఖరీఫ్‌లో ఎకరాకు 6 నుంచి 8 టన్నులు, రబీలో 8 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనా. అయితే ఆగస్టు నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో.. ఎకరాకు రెండు నుంచి 3 టన్నుల వరకు దిగుబడి తగ్గిందని చెబుతున్నారు.

గతేడాది మాదిరే సాగు విస్తీర్ణంలో పెద్దగా వ్యత్యాసం లేకపోయినా దిగుబడి తగ్గడంతో ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. రిటైల్‌ మార్కెట్‌లో నాణ్యమైన ఉల్లి కిలో రూ.45 నుంచి రూ.50 దాకా పలుకుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలోనూ అధిక వర్షాల కారణంగా ఉల్లి పంట దెబ్బతినడంతో అక్కడినుంచి దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో రాష్ట్రంలోని ఉల్లికి «అధిక ధర లభిస్తోంది. కాగా గతేడాది బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరలు అనూహ్యంగా పెరిగి వినియోగదారులు తీవ్రంగా ఇబ్బంది పడడం తెలిసిందే.

అటువంటి పరిస్థితులు ఈ ఏడాది తలెత్తకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం విదేశాలకు ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ కారణంగా ఉల్లి ధర కిలో ఇప్పటికి రిటైల్‌ మార్కెట్‌లో రూ.50లోపే ఉంది. ఎగుమతులపై నిషేధం విధించకపోయుంటే ఇప్పటికే కిలో రూ.100 పలికేదని అధికారులు చెబుతున్నారు. వర్షాలు తగ్గుముఖం పడితే డిసెంబర్‌లో కొత్త పంట మార్కెట్‌కు వచ్చి ధర తగ్గుతుందని, వర్షాలు ఇలానే కొనసాగితే ధర మరింత పెరిగే అవకాశం లేకపోలేదని వారంటున్నారు.  

మరిన్ని వార్తలు