Republic Day: విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపు.. వాహనాల రూట్‌ ఇలా.. 

25 Jan, 2023 09:18 IST|Sakshi

విజయవాడ స్పోర్ట్స్‌: ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో ఈ నెల 26వ తేదీన గణతంత్ర వేడుకలు జరుగుతున్న దృష్ట్యా ట్రాఫిక్‌ ఆంక్షలను విధిస్తున్నట్లు ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ టి.కె.రాణా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు.

ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో బెంజిసర్కిల్‌ నుంచి ఆర్టీసీ వై జంక్షన్‌ వరకు, రెడ్‌సర్కిల్‌ నుంచి ఆర్టీఏ జంక్షన్‌ వరకు, శిఖామణి సెంటర్‌ నుంచి వెటర్నరీ జంక్షన్‌ వరకు ఎలాంటి వాహనాలను అనుమతించమన్నారు. బెంజిసర్కిల్‌ నుంచి డీసీపీ బంగ్లా వరకు ఆహా్వనితులను మాత్రమే అనుమతిస్తామన్నారు. ప్రజల సౌకర్యార్థం ఈ ఆంక్షలు విధిస్తున్నామన్నారు.

వాహనాల రూట్‌ ఇలా.. 
ఆర్టీసీ వై జంక్షన్‌ నుంచి బెంజిసర్కిల్‌ రాకపోకలు సాగించే బస్సులు, ఇతర వాహనాలు ఏలూరు రోడ్డు, స్వర్ణప్యాలెస్, దీప్తిసెంటర్, పుష్పాహోటల్, జమ్మిచెట్టు సెంటర్, సిద్ధార్థ జంక్షన్‌ మార్గాన బందరులాకులు, రాఘవయ్యపార్క్, పాతఫైర్‌ స్టేషన్‌రోడ్, అమెరికన్‌ ఆస్పత్రి, మసీద్‌రోడ్, నేతాజీబ్రిడ్జి, గీతానగర్, స్క్యూ బ్రిడ్జి మార్గాన్ని అనుసరించాలి.  
ఐదో నెంబర్‌ రూట్‌లో ప్రయాణించే సిటీ బస్సులు ఏలూరు రోడ్డు మీదుగా రామవరప్పాడు రింగ్‌ నుంచి బెంజిసర్కిల్‌కు చేరుకోవాలి.  
హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నంకు రాకపోకలు సాగించే భారీ, మధ్యతరహా వాహనాలు ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్‌జంక్షన్‌ మార్గాన్ని అనుసరించాలి.  
విశాఖపట్నం నుంచి చెన్నైకి రాకపోకలు సాగించే భారీ, మధ్యతరహా వాహనాలు హనుమాన్‌జంక్షన్, గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, రేపల్లె, బాపట్ల, చీరాల, త్రోవగుంట, ఒంగోలు మార్గాన్ని అనుసరించాలి.  
గుంటూరు నుంచి విశాఖపట్నంకు రాకపోకలు సాగించే వాహనాలు బుడంపాడు, తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూడిబ్రిడ్జి, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్‌జంక్షన్‌ మార్గాన్ని అనుసరించాలి.  
చెన్నై నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే వాహనాలు మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నాల్గొండ, నార్కెట్‌పల్లి మార్గాన్ని అనుసరించాలి.

వాహనాల పార్కింగ్‌ ప్రదేశాలు.. 
గణతంత్ర వేడుకలకు విచ్చేసే ఆహా్వనితులు వారి వాహనాలు పార్కింగ్‌ చేసుకునేందుకు ప్రత్యేక స్థలాలను కేటాయించినట్లు సీపీ తెలిపారు. 
అ అ పాస్‌లు కలిగిన వారు స్టేడియం గేట్‌–2 నుంచి లోపలికి ప్రవేశించి, అక్కడే నిర్ధేశిత ప్రాంతంలో వాహనాలు పార్కింగ్‌ చేసుకోవాలి.  
అ1, అ2 పాస్‌లు కలిగిన వారు గేట్‌–4 నుంచి ప్రవేశించి హ్యాండ్‌బాల్‌ గ్రౌండ్‌ నందు వాహనాలు పార్కింగ్‌ చేసుకోవాలి. 
ఆ1, ఆ2 పాస్‌లు కలిగిన వారు గేట్‌–6 నుంచి ప్రవేశించి ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌ నందు, స్టేడియానికి ఎదురుగా ఉన్న ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ గ్రౌండ్‌ నందు వాహనాలు పార్కింగ్‌ చేసుకోవాలి.

మీడియా ప్రతినిధులు గేట్‌–2 నుంచి స్టేడియం లోపలికి ప్రవేశించాలి.  
నున్న, సింగ్‌నగర్, సత్యనారాయణపురం, మాచవరం వైపు నుంచి వచ్చే స్కూల్, కాలేజీ బస్సులు సీతారామపురం జంక్షన్‌ మీదుగా పుష్పా హోటల్‌ వరకు చేరుకుని అక్కడ విద్యార్థులను దింపి బస్సులను మధుచౌక్, జమ్మిచెట్టు, సిద్ధార్థ పబ్లిక్‌ స్కూల్‌నందు పార్కింగ్‌ చేసుకోవాలి. 
పటమట వైపు నుంచి స్కూల్, కాలేజీ బస్సులు బెంజిసర్కిల్‌ మీదుగా వెటర్నరీ జంక్షన్‌ వరకు వచ్చి అక్కడే విద్యార్థులను దింపి బస్సులను నేతాజీ బ్రిడ్జి, స్క్యూబ్రిడ్జి, బెంజిసర్కిల్, నిర్మలజంక్షన్, పాలిక్లినిక్‌రోడ్డు, సిద్ధార్థ పబ్లిక్‌ స్కూల్‌ నందు పార్కింగ్‌ చేసుకోవాలి.  
వన్‌టౌన్, కొత్తపేట, భవానీపురం, ఇబ్రహీంపట్నం నుంచి వచ్చే స్కూల్, కాలేజీ బస్సులు స్వరాజ్‌ మైదానంలో పార్కింగ్‌ చేసుకోవాలి.
చదవండి: టీడీపీ నేత గోడి అరుణకు పార్టీలో లైంగిక వేధింపులు.. రాజీనామా ప్రకటన  

మరిన్ని వార్తలు