జయహో బీసీ మహాసభ: ట్రాఫిక్‌ ఆంక్షలు, పార్కింగ్‌ ప్లేస్‌ వివరాలు ఇవే..

6 Dec, 2022 10:27 IST|Sakshi

సాక్షి, విజయవాడ: నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో ఈ నెల ఏడో తేదీన జయహో బీసీ మహాసభ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ టి.కె.రాణా సోమవారం తెలిపారు. నగరంలో వాహన రాకపోకలకు అంతరాయం కలగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

బుధవారం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ  ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. బెంజిసర్కిల్‌ నుంచి బందరు రోడ్డులోకి, పోలీస్‌ కంట్రోల్‌ రూం నుంచి బెంజిసర్కిల్‌ వైపు, ఐదో నంబర్‌ రూట్, ఏలూరు రోడ్డులోని సీతారామపురం సిగ్నల్‌ నుంచి ఆర్‌టీఏ జంక్షన్‌ వరకు, శిఖామణి సెంటర్‌ నుంచి బందరు రోడ్డుకు జయహో బీసీ మహా సభకు వచ్చే వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. 

జాతీయ రహదారులపై.. 
- హైదరాబాద్‌–విశాఖపట్నం మార్గంలో ప్రయాణించే వాహనాలు ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్‌        జంక్షన్‌ ద్వారా రాకపోకలు సాగించాలి. 
- విశాఖపట్నం–చెన్నై మార్గంలో ప్రయాణించే వాహనాలు హనుమాన్‌జంక్షన్, గుడివాడ, పామర్రు, చల్లపల్లి, రేపల్లె, బాపట్ల, చీరాల, త్రోవగుంట, ఒంగోలు మార్గంలో ప్రయాణించాలి.  
- గుంటూరు–విశాఖపట్నం మార్గంలో ప్రయాణించే వాహనాలు బుడంపాడు, తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్‌జంక్షన్‌ మీదుగా రాకపోకలు సాగించాలి.  
- చెన్నై–హైదరాబాద్‌ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలు మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్‌పల్లి మీదుగా ప్రయాణించాలి.  

విజయవాడలో ఇలా.. 
- విశాఖపట్నం నుంచి వచ్చే బస్సులు రామవరప్పాడు రింగ్, మహానాడు జంక్షన్, బెంజి       సర్కిల్‌ ఫ్లై ఓవర్, స్క్యూ బ్రిడ్జి, వారధి జంక్షన్‌ మీదుగా పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌కు చేరుకోవాలి.  
- పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే బస్సులు పీసీఆర్‌ జంక్షన్, ప్రకాశం విగ్రహం జంక్షన్, పాత గవర్నమెంట్‌ ఆస్పత్రి, ఏలూరు లాకులు, జీఎస్‌ రాజురోడ్డు, సీతన్నపేట సిగ్నల్, బీఆర్‌టీఎస్‌ రోడ్డు, గుణదల, రామవరప్పాడు మార్గంలో ప్రయాణించాలి.  
- మచిలీపట్నం, గుడివాడ ప్రాంతాల నుంచి పీఎన్‌బీఎస్‌కు వచ్చే బస్సులు తాడిగడప 100 అడుగుల రోడ్డు, ఎనికేపాడు, రామవరప్పాడురింగ్, బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్, కృష్ణలంక మార్గాన్ని అనుసరించాలి.  
- బస్టాండ్‌ నుంచి మచిలీపట్నం, గుడివాడ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పీసీఆర్, చల్లపల్లి బంగ్లా, ఏలూరు లాకులు, బీఆర్‌టీఎస్‌రోడ్డు, గుణదల, రామవరప్పాడురింగ్, ఎనికేపాడు, తాడిగడప 100 అడుగుల రోడ్డును అనుసరించాలి.  
- బెంజిసర్కిల్‌ వైపు నుంచి బందరు రోడ్డులో ప్రయాణించే వాహనాలు పకీరుగూడెం జంక్షన్, స్క్యూ బ్రిడ్జి, వారధి జంక్షన్‌ మార్గం ద్వారా పీఎన్‌బీఎస్‌కు చేరుకోవాలి.  
- పీఎన్‌బీఎస్‌ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళ్లే బస్సులు బస్టాండ్‌లో మధ్యనున్న ఐదో నంబర్‌ గేటు ద్వారా బయటకు వచ్చి రాజీవ్‌గాంధీ పార్కు, కనకదుర్గ ఫ్లై ఓవర్, స్వాతిజంక్షన్‌ మార్గాన్ని అనుసరించాలి.   

పార్కింగ్‌ ప్రదేశాలు ఇలా..
- మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల వాహనాలను సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ గ్రౌండ్‌లో నిలపాలి.  
- ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుంచి సభకు వచ్చే బస్సులను స్వరాజ్య మైదానంలో పార్కు చేయాలి.     
- గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, నంద్యాల జిల్లాల       నుంచి సభకు వచ్చే బస్సులకు సిద్ధార్థ పబ్లిక్‌ స్కూల్‌ మైదానం కేటాయించారు. 
- కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి సభకు వచ్చే బస్సులను సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ గ్రౌండ్‌లో నిలపాలి. 
- పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల నుంచి సభకు వచ్చే బస్సులను బీఆర్‌టీఎస్‌ రోడ్డులో నిలపాలి. 
- శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వచ్చే బస్సులకు ఆంధ్రా లయోల కాలేజీ మైదానాలను కేటాయించారు.  

మరిన్ని వార్తలు