విజయవాడలో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు.. మళ్లింపులు ఇలా.. 

17 Feb, 2022 08:48 IST|Sakshi

సాక్షి, విజయవాడ: బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌–2 ప్రారంభోత్సవం, ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ గురువారం నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ టి.కె.రాణా బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నూతనంగా నిర్మించిన ఫ్లై ఓవర్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రారంభిస్తారన్నారు.

అనంతరం స్టేడియంలో జరిగే బహిరంగ సభలో నాయకుల ప్రసంగం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వాహన రాకపోకలను వేరే మార్గాలకు మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంక్షలు ముగిసే వరకు నూతన ఫ్లై ఓవర్‌పై, బందరు రోడ్డులో ఎలాంటి వాహనాలను అనుమతించమని స్పష్టం చేశారు. వాహనదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

మళ్లింపులు ఇలా.. 
చెన్నై నుంచి విశాఖపట్నంకు వెళ్లే లారీలు, భారీ వాహనాలు ఒంగోలు, త్రోవగుంట, చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్‌జంక్షన్‌ మీదుగా రాకపోకలు సాగించాలన్నారు.  
చెన్నై నుంచి హైదరాబాద్‌ వెళ్లే లారీలు, భారీ వాహనాలు మేదరమెట్ల, పిడుగురాళ్ల, దాచేపల్లి, నకిరేకల్‌ మీదుగా వెళ్లాలన్నారు.  
ఏలూరు వైపు నుంచి హైదరాబాద్‌ వెళ్లే లారీలు, భారీ వాహనాలు హనుమాన్‌ జంక్షన్, నూజివీడు, మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మీదుగా వెళ్లాల్సి ఉంటుందన్నారు.  
గుంటూరు నుంచి విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌ వెళ్లే కార్లు, ఇతర వాహనాలను కనకదుర్గ వారధి పైకి అనుమతించమన్నారు. ఈ వాహనాలు ప్రకాశం బ్యారేజీ మీదుగా నగరానికి చేరుకుని అక్కడ నుంచి హైవే పై హైదరాబాద్, ఏలూరు రోడ్డు నుంచి రామవరప్పాడు మీదుగా విశాఖపట్నంకు చేరుకోవాలన్నారు.  
ఏలూరు నుంచి పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌కు వచ్చే వాహనాలు రామవరప్పాడు రింగ్, ఏలూరు రోడ్డు, పోలీస్‌ కంట్రోల్‌ మీదుగా రాకపోకలు సాగించాలన్నారు.  
పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ నుంచి మచిలీపట్నం వెళ్లే వాహనాలు ఏలూరు రోడ్డు, రామవరప్పాడు రింగ్, ఎనికేపాడు, తాడిగడప 100 అడుగుల రోడ్డు మీదుగా వెళ్లాలన్నారు.  
బెంజిసర్కిల్‌ నుంచి బందర్‌ రోడ్డు మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే సిటీ బస్సులను రమేష్‌ హాస్పిటల్, రామవరప్పాడు రింగ్, ఏలూరు రోడ్, పోలీస్‌ కంట్రోల్‌ రూం రూట్‌కు మళ్లిస్తున్నట్లు చెప్పారు.  
నూతన ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ టి.కె.రాణా కోరారు.  

మరిన్ని వార్తలు