పెళ్లింట చావు డప్పులు

6 Apr, 2021 02:58 IST|Sakshi

వీర జవాను మురళీకృష్ణ స్వగ్రామంలో అలముకున్న విషాదఛాయలు

సత్తెనపల్లి: పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట చావు డప్పులు మోగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ వద్ద మావోయిస్టుల దురాగతానికి గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాను శాఖమూరి మురళీకృష్ణ (32) బలవటంతో ఆ గ్రామం శోకసంద్రమైంది. పేద వ్యవసాయ కుటుంబానికి చెందిన శాఖమూరి రవీంద్రబాబు, విజయకుమారి దంపతుల చిన్నకుమారుడైన మురళీకృష్ణ ఆరేళ్ల క్రితం సీఆర్‌పీఎఫ్‌ జవానుగా ఉద్యోగంలో చేరి భరతమాత సేవకు అంకితమయ్యాడు. కోబ్రా–210 విభాగానికి చెందిన మురళీకృష్ణ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.

మురళీకృష్ణకు గత ఏడాది ఆగస్ట్‌ 13న వివాహం జరగాల్సి ఉన్నప్పటికీ దగ్గరి బంధువు చనిపోవటంతో వాయిదా పడింది. ఈ ఏడాది మే 22న వివాహం జరుప తలపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ నెల ఒకటో తేదీన మురళీకృష్ణ తల్లికి ఫోన్‌ చేసి మాట్లాడాడు. సెలవు మంజూరైందని, మే 15న ఇంటికి వస్తానని చెప్పాడు. అలా చెప్పిన మూడో రోజే శాశ్వతంగా సెలవు తీసుకుని ఎవరికీ అందని లోకాలకు వెళ్లిపోయాడని ఆ తల్లి చేస్తోన్న రోదన వర్ణనాతీతం. 

మరిన్ని వార్తలు