నేటినుంచి సర్పంచులకు శిక్షణ

22 Jul, 2021 03:33 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు గ్రామ పంచాయతీ పాలనపై గురువారం నుంచి ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. ఆగస్టు 14 వరకు పంచాయతీరాజ్‌శాఖ, స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పంచాయతీరాజ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (ఎస్‌ఐఆర్‌డీ) ఆధ్వర్యంలో కొనసాగే ఈ శిక్షణ తరగతులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రారంభిస్తారని ఎస్‌ఐఆర్‌డీ డైరక్టర్‌ జె.మురళి తెలిపారు. గురువారం ఉదయం 9 గంటలకు మొత్తం 60 కేంద్రాల్లో ఈ తరగతులు మొదలవుతాయన్నారు. సర్పంచులకు రెసిడెన్షియల్‌ పద్ధతిలో వారి రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. కరోనా నేపథ్యంలో ప్రతి తరగతికి 20 మందే హాజరయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఒక్కో బ్యాచ్‌లో ప్రతి జిల్లాలో 120 మందికి మాత్రమే శిక్షణ ఇస్తున్నామన్నారు. ఒక్కో బ్యాచ్‌కి 3 రోజులపాటు 14 అంశాల్లో శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి జిల్లాలో గరిష్టంగా 7 బ్యాచ్‌లు ఉంటాయని చెప్పారు. ఈ తరగతుల నిర్వహణకు మొదటి విడతగా జిల్లాలకు రూ.1,77,63,998 విడుదల చేసినట్టు చెప్పారు. సర్పంచుల్లో గర్భిణులకు మినహాయింపు ఇచ్చామని, పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. 

సర్పంచులకు శిక్షణ ఇచ్చే 14 అంశాలు
తొలిరోజు
1. గ్రామ పంచాయతీలు, మన స్థానిక ప్రభుత్వాలు– గ్రామ సచివాలయాల ఏర్పాటు, ప్రాముఖ్యత
2. సర్పంచ్, వార్డుసభ్యులు, సిబ్బంది అధికారాలు, విధులు, బాధ్యతలు
3. స్థానిక స్వపరిపాలన– గ్రామ సచివాలయాలు, వలంటీర్లు, గ్రామసభ, గ్రామ పంచాయతీ సమావేశాలు, కార్యచరణ కమిటీలు
4. మౌలిక వసతుల కల్పనతో గ్రామాభివృద్ధి – తాగునీటి సరఫరా, అంతర్గత రహదారులు, వీధిదీపాలు మొదలైనవి
5. పారిశుధ్యం – జగనన్న స్వచ్ఛ సంకల్పం

రెండో రోజు
6. నియంత్రణ అధికారులతో గ్రామ పంచాయతీ పాలన– పార్ట్‌1
7. నియంత్రణ అధికారులతో గ్రామ పంచాయతీ పాలన– పార్ట్‌ 2
8. గ్రామ పంచాయతీల ఆర్థిక పరిపుష్టి, ఆర్థిక వ్యవహారాలు
9. గ్రామ పంచాయతీల ఆదాయ వ్యయాలు– వ్యయ నియమాలు– బడ్జెట్, అభివృద్ధి ప్రణాళికలు
10. ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు– నవరత్నాలు– గ్రామ సచివాలయాల ద్వారా అందుతున్న వివిధ పథకాలు

మూడో రోజు
11. పారదర్శక పాలన– పంచాయతీలపై పర్యవేక్షణ, నియంత్రణ వ్యవస్థ
12. పంచాయతీ రికార్డులు, నివేదికలు
13. గ్రామ పంచాయతీలో జవాబుదారీతనం– క్రమశిక్షణ
14. కేంద్ర ఆర్థికసంఘం నిధులు, ఉపాధిహామీ పథకం, స్వచ్ఛ భారత్‌ 

మరిన్ని వార్తలు