ఒంటిమిట్ట.. రైలు ఆగేదెట!

13 Jun, 2022 22:54 IST|Sakshi

ఏకశిలానగరాన్ని పట్టించుకోని దక్షిణమధ్య రైల్వే 

ఒంటిమిట్ల స్టేషన్‌లో ఆగని రైళ్లు 

ఎఫ్‌ఓబీ నిర్మాణానికి ఆసక్తి చూపని అధికారులు 

రాజంపేట: రాష్ట్రంలో వైష్ణవ క్షేత్రంగా వెలుగొందుతున్న ఒంటిమిట్ట (ఏకశిలానగరం) కోదండరాముని భక్తులపై..స్టేషన్‌ అభివృద్ధిపై రైల్వే చిన్నచూపు ప్రదర్శిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు భద్రాచలం రామునిక్షేత్రంగా వెలుగొందింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఒంటిమిట్ట ప్రముఖ క్షేత్రంగా భాసిల్లుతోంది.

2014లో ఏపీ ప్రభుత్వం దీనిని అధికారిక ఆలయంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం విలీనం చేసుకుని వందకోట్లకుపైగా వ్యయంతో క్షేత్రాన్ని అభివృద్ధి చేసింది. అయితే రైల్వేశాఖ, రైల్వేమంత్రిత్వశాఖ ఒంటిమిట్టకు నలుదిశల నుంచి ప్రయాణికులు క్షేత్రానికి వచ్చేలా సౌకర్యాలు కల్పించడంలో వివక్షను ప్రదర్శించింది. 

ఒంటిమిట్టను గుర్తించని దక్షిణమధ్య రైల్వే 
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భద్రాచలం రైల్వేస్టేషన్‌ను గుర్తించినట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్ట రైల్వేస్టేషన్‌ను దక్షిణమధ్యరైల్వే గుర్తించలేదు. ముంబై–చెన్నై కారిడార్‌ రైలు మార్గంలో నడిచే ప్రతి రైలుకు ఒంటిమిట్టలో స్టాపింగ్‌ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అధ్యాత్మికవేత్తలు అంటున్నారు. ఒక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఒంటిమిట్టను పరిగణలోకి తీసుకోలేదు. ఒంటిమిట్ట, భద్రాచలం రెండు పుణ్యక్షేత్రాలు దక్షిణమధ్యరైల్వేలోనే ఉండేవి. భద్రాచలం స్టేషన్‌కు ఇస్తున్న ప్రాధాన్యతను ఒంటిమిట్టకు ఇవ్వడంలేదంటే వివక్ష ప్రదర్శించినట్లేనని భక్తులు భావిస్తున్నారు. 

దూరప్రాంత భక్తులెలా వచ్చేది..  
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు ఒంటిమిట రామయ్య దర్శనానికి వస్తున్నారు. భద్రాచలం రోడ్‌ రైల్వేస్టేషన్‌ మీదుగా భక్తులు వచ్చేందుకు వీలుగా రైళ్లు నడుస్తున్నాయి. ఒంటిమిట్ట స్టేషన్‌ పేరుకు మాత్రమే ఉంది. ఇక్కడ డెమై రైలు తప్ప ఏ రైలుకు స్టాపింగ్‌ లేదు. నవ్యాంధ్ర ఏర్పడినప్పటి నుంచి ఒంటిమిట్ట స్టేషన్‌ అభివృద్ధి చేయాలంటూ ప్రజాప్రతినిధులు గళం విప్పుతున్నారు. అయినా రైల్వేశాఖలో ఎటువంటి స్పందన కనిపించలేదన్న విమర్శలున్నాయి. 

తాజాగా ఒంటిమిట్ట స్టేషన్‌కు ఎఫ్‌ఓబీకి బ్రేక్‌ 
ఒంటిమిట రైల్వేస్టేషన్‌లో డబుల్‌ ఫ్లాట్‌ఫాంలు ఉన్నాయి. భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్ధ్యం ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిని(ఎఫ్‌ఓబీ) రైల్వేబోర్డు మంజూరు చేసింది. గుంతకల్‌ డివిజన్‌లో మూడుచోట్ల మంజూరు చేస్తే, అందులో ఒంటిమిట్ట ఒకటి కావడం గమనార్హం. సెకండ్‌ప్లాట్‌ఫాంకు వెళ్లాలన్నా, అటువైపు పల్లెలోకి వెళ్లాలన్న ఎఫ్‌ఓబీ నిర్మాణ ఆవశ్యకత ఉంది. నిధులు వెనక్కి వెల్లకుండా అధికారులు ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.  

మరిన్ని వార్తలు