Trains Cancelled: కరోనా ఎఫెక్ట్‌.. 55 రైళ్లు రద్దు..

22 Jan, 2022 08:42 IST|Sakshi

ఈ నెల 24 వరకు నిలుపుదల..

తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం

దక్షిణ మధ్య రైల్వే వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌/రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): రైళ్ల రాకపోకలపై మళ్లీ కోవిడ్‌ ప్రభావం పడింది. రద్దీ నియంత్రణకుగాను మళ్లీ రైళ్లను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొద్దిరోజులుగా కోవిడ్‌ కేసులు తీవ్రమవుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే 55 అన్‌రిజర్వ్‌డ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల (అప్‌ అండ్‌ డౌన్‌ జతలు)ను ఈ నెల 24 వరకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అన్‌రిజర్వ్‌డ్‌ మూలాన సీట్ల సంఖ్యకు మించి టికెట్లు జారీ చేస్తుండటంతో ఈ రైళ్లలో కొంత రద్దీ ఉంటోందని, ఇది కోవిడ్‌ కేసులు మరింత పెరిగేందుకు కారణమవుతుందని అధికారులు భావిస్తున్నారు.

చదవండి: కోవిడ్‌ పాజిటివా! ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి

దేశవ్యాప్తంగా కోవిడ్‌ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో తగు నిర్ణయం తీసుకోవాలని ఇటీవల రైల్వే బోర్డు ఆదేశించడంతో దక్షిణ మధ్య రైల్వే ఈ రద్దు నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో పరిస్థితిని అంచనా వేసి వీటిని తిరిగి ప్రారంభించాలా, మరిన్ని రైళ్లను రద్దు చేయాలా అన్న విషయమై నిర్ణయం తీసుకోనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రద్దయిన వాటిలో విజయవాడ–నర్సాపూర్, మచిలీపట్నం–విజయవాడ, మచిలీపట్నం–గుడివాడ, నర్సాపూర్‌–నిడదవోలు, బిట్రగుంట–చెన్నై సెంట్రల్, తెనాలి–రేపల్లె, కర్నూలు సిగా–గుంతకల్లు, డోన్‌–గుత్తి, తిరుపతి–కాట్‌పాడ్, సికింద్రాబాద్‌–ఉమ్ధానగర్, మేడ్చల్‌–సికింద్రాబాద్, కాచిగూడ–నడికుడి, కర్నూలు–కాచిగూడ తదితర రైళ్లు ఉన్నాయి.   

>
మరిన్ని వార్తలు