AP: ఆ వాదనలో నిజం లేదు: ట్రాన్స్‌ కో ఎండీ

31 Mar, 2022 18:27 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ప్రస్తుతం 230 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉందని.. ట్రాన్స్‌కో ఎండీ శ్రీధర్‌ అన్నారు. వేసవి దృష్ట్యా వినియోగం పెరిగిందని.. అదనపు విద్యుత్‌ కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, విద్యుత్ వినియోగంలో 50 శాతం జనాభా 75 యూనిట్లలోపు టారిఫ్‌లోకి వస్తారన్నారు. 50 శాతం మంది ప్రజల మీద పెరిగిన విద్యుత్ ఛార్జీలు భారం స్వల్పంగానే ఉంటుందని తెలిపారు. ప్రజల కోరిక మేరకే టెలిస్కోపిక్ విధానం అమలు చేస్తున్నామని.. ఈ విధానంతో ప్రజలపై పెద్దగా భారం పడదని శ్రీధర్‌ అన్నారు.

చదవండి: సమగ్ర భూసర్వేతో దేశానికే ఏపీ ఒక దిక్సూచి కావాలి: సీఎం జగన్‌

‘‘విద్యుత్ ఛార్జీల సవరణ ద్వారా ప్రజలపై పడే భారం స్వల్పమే. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయం ప్రభుత్వానిది కాదు.. ఏపిఈఆర్సీది. గతంలో దీర్ఘకాలిక విద్యుత్ సరఫరా ఒప్పందాలు అధిక ధరలకు చేసుకున్నారు. బొగ్గు ధరల కారణంగా గతంలో కొన్ని యూనిట్లు మూసేయాల్సి వచ్చింది. ప్రస్తుతం వేసవి కారణంగా డిమాండ్ పెరిగింది. అందుకే 230 మిలియన్ యూనిట్లు వినియోగం అవుతోంది. వాస్తవానికి సాధారణ రోజుల్లో 180 మిలియన్ యూనిట్ల వినియోగం మాత్రమే ఉంటుంది. దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంటే తీవ్ర నష్టం జరుగుతుంది. పీపీఏల రద్దు వల్లే ప్రస్తుతం ఛార్జీలు పెరిగాయన్న వాదన నిజం కాదు. పీపీఏలను ప్రభుత్వం రద్దు చేయలేదు. ధరలను సమీక్షించమనే ప్రభుత్వం కంపెనీలను కోరింది. సెకీ నుంచి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం. ఉచిత విద్యుత్ సరఫరా కోసమే సెకీ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్తును వినియోగిస్తామని’’ శ్రీధర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు