పలువురు ఐఏఎస్‌ల బదిలీ

13 Aug, 2022 04:43 IST|Sakshi

సీఎస్‌ సమీర్‌శర్మ ఉత్తర్వులు జారీ

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ బదిలీలు తక్షణం అమల్లోకి వస్తాయంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. హ్యాండ్‌లూమ్స్, టెక్స్‌టైల్స్‌ డైరెక్టర్‌గా ఉన్న చదలవాడ నాగరాణిని సాంకేతిక విద్య డైరెక్టర్‌గా బదిలీ చేశారు. పోలా భాస్కర్‌ను సాంకేతిక విద్య డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతల నుంచి రిలీవ్‌ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న ఎంఎం నాయక్‌ను హ్యాండ్‌లూమ్స్, టెక్స్‌టైల్స్‌ కార్యదర్శిగా బదిలీ చేశారు.

ఆయనకు ఆప్కో వీసీ, ఎండీతోపాటు ఏపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు సీఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆప్కో ఎండీ, ఖాదీ–గ్రామీణ పరిశ్రమల శాఖ సీఈఓ బాధ్యతల నుంచి చదలవాడ నాగరాణిని రిలీవ్‌ చేశారు. ఇక బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మికి సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. మిషన్‌ క్లీన్‌ కృష్ణా, గోదావరి కెనాల్స్‌ కమిషనర్‌గా ఉన్న కాటంనేని భాస్కర్‌ను పాఠశాల విద్యా శాఖ పరిధిలోని పాఠశాల మౌలిక వసతుల కమిషనర్‌గా బదిలీ చేశారు.

తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు కాటంనేని భాస్కర్‌ మిషన్‌ క్లీన్‌ కృష్ణా, గోదావరి కెనాల్స్‌ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. అలాగే, బి. శ్రీనివాసరావును సర్వశిక్ష అభియాన్‌ రాష్ట్ర అదనపు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు శ్రీనివాసరావుకు రైతుబజార్ల సీఈఓగా పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు.   

మరిన్ని వార్తలు