టీచర్ల బదిలీల్లో మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీలకే పెద్దపీట

14 Dec, 2022 10:16 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని స్కూళ్లలోనూ తగినంత సంఖ్యలో టీచర్లు అందుబాటులో ఉండేలా పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. తద్వారా విద్యార్థుల బోధనాభ్యసనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా రాష్ట్రంలో టీచర్ల బదిలీల ప్రక్రియను చేపట్టిన అధికారులు ఈ దిశగా చర్యలు చేపట్టారు. బదిలీల మేరకు రిలీవ్‌ అయిన టీచర్ల స్థానాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాకే వారిని రిలీవ్‌ చేస్తున్నారు. ఒకే టీచర్‌ ఉన్న స్కూళ్లో ఆ టీచర్‌కు బదిలీ అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు ఆ టీచర్‌ను రిలీవ్‌ చేయరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అలాగే ఇద్దరు ఉన్న స్కూల్లో ఇద్దరికీ బదిలీ అయితే జూనియర్‌ టీచర్‌ను రిలీవ్‌ చేయరాదని పేర్కొంది. ముగ్గురున్న చోట బదిలీలుంటే జూనియర్లయిన ఇద్దరు టీచర్లను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తయ్యేవరకు రిలీవ్‌ చేయరు. ముఖ్యంగా ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల స్కూళ్లల్లో టీచర్లు లేరనే మాట రాకుండా.. ముందుగా మారుమూల ప్రాంతాల స్కూళ్లలో ఖాళీలు భర్తీ అయ్యేలా బదిలీల మార్గదర్శకాల్లో ప్రభుత్వం పలు అంశాలను చేర్చింది. జిల్లాల్లోని ప్రస్తుతం భర్తీ అయిన పోస్టులకు సమానంగా ఖాళీలను చూపించి బదిలీ ప్రక్రియను అధికారులు కొనసాగించనున్నారు.

మిగిలిన ఖాళీ పోస్టులను అన్ని ప్రాంతాలకూ సమానంగా సర్దుబాటు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఉదాహరణకు ఒక జిల్లాలో 5వేల పోస్టులు ఉంటే.. అక్కడ 4,500 మంది టీచర్లు పనిచేస్తుంటే తక్కిన 500 ఖాళీలను ప్రాంతాల వారీగా మొదటి మూడు కేటగిరీలకూ సమానంగా బదలాయిస్తారు. దీనివల్ల ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల స్కూళ్లకు ప్రయోజనం ఉంటుంది.  

ఏజెన్సీ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ 
మైదాన ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల స్కూళ్ల టీచర్లను కూడా బదిలీ చేస్తున్నా.. ఏజెన్సీ ప్రాంతాల స్కూళ్లలో ఒకేసారి ఖాళీలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గిరిజన సమీకృతాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాంతాల్లోని పాఠశాలల టీచర్లు.. నాన్‌ ఐటీడీఏ ప్రాంతాల్లో బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాంటి చోట్ల ఆయా స్కూళ్లలో టీచర్లు లేరన్న పరిస్థితి రాకుండా ప్రత్యామ్నాయ భర్తీ ఏర్పాట్లు చేశాకే బదిలీ అయిన టీచర్లను రిలీవ్‌ చేస్తారు.

ఐటీడీఏ ప్రాంతాల్లో ఖాళీ టీచర్‌ పోస్టులు భర్తీకాని పక్షంలో ఐటీడీయేతర ప్రాంతాల్లో బాగా జూనియర్లయిన టీచర్లను ఆయా స్థానాల్లో తాత్కాలికంగా నియమించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే గతంలో ఏజెన్సీ, మారుమూల ప్రాంతాలకు బదిలీ అయిన వారిలో ఎక్కువమంది అనధికారికంగా లేదా అధికారికంగా గైర్హాజరులో ఉంటున్నారు. ఇప్పుడు ఇలాంటి వారి ఖాళీలను బదిలీల్లో చూపించడం ద్వారా అక్కడి పోస్టుల భర్తీకి ఆస్కారం ఉంటుంది. తప్పనిసరి బదిలీ అవ్వాల్సిన గ్రేడ్‌–2 హెచ్‌ఎంలు బదిలీ దరఖాస్తు చేయకున్నా వారిని కేటగిరీ–4లోని మిగులు పోస్టుల్లో నియమిస్తారు. అక్కడ ఖాళీ లేనిపక్షంలో కేటగిరీ–3లోని స్కూళ్ల ఖాళీల్లోకి పంపుతారు.  

కన్వర్షన్‌ కోరుకున్న సబ్జెక్టు టీచర్లకు.. 
కాగా ఇటీవల సబ్జెక్టు టీచర్ల కొరతను పరిష్కరించడానికి ప్రభుత్వం ఆయా సబ్జెక్టులలో అర్హతలున్న వారిని మార్చుకోవడానికి (కన్వర్షన్‌) అనుమతించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది టీచర్లు ఇలా కన్వర్షన్‌కు లేఖలు ఇచ్చారు. ఇలా అంగీకారం తెలిపిన వారిని వెంటనే ఆయా సబ్జెక్టుల్లోకి మార్చడంతోపాటు బదిలీకి దరఖాస్తు చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ బదిలీల ద్వారా సబ్జెక్టు టీచర్లు దాదాపు అన్ని పాఠశాలలకు అందుబాటులోకి వచ్చే అవకాశముంటుందని చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాల్లో మిగులు టీచర్లుగా గుర్తించిన వారందరినీ ప్రభుత్వం అవసరమైన స్కూళ్లలో తాత్కాలికంగా సర్దుబాటు చేసింది. ఇప్పుడు బదిలీల్లో ఆయా పోస్టుల్లో రెగ్యులర్‌ టీచర్లు నియమితులయ్యే అవకాశం ఉంది.  

గతంలో కన్నా మెరుగ్గా ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి.. 
రాష్టంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి గతంలో కన్నా మెరుగ్గా ఉంది. విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ ఉండాలన్న నిబంధన ఉంది. కానీ రాష్ట్రంలో అది 20 కన్నా తక్కువగానే ఉందని పాఠశాల విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ ఫర్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (యూడైస్‌) ప్లస్‌ గణాంకాల ప్రకారం చూసినా గత ప్రభుత్వాల కన్నా మెరుగ్గా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.  

(చదవండి: ఏపీఏటీ సిబ్బందిని మరోచోటుకు పంపడమేంటి?)

మరిన్ని వార్తలు