కనకదుర్గ ఫ్లైఓవర్‌పై జర్నీ అద్భుతం..

19 Oct, 2020 10:45 IST|Sakshi

సాక్షి, విజయవాడ: అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానం... ఆరు వరుసలతో విశాలంగా రోడ్ నిర్మాణం. కృష్ణా నదిపై 46 పిల్లర్లపై వారధి.. విజయవాడ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలకి చెక్ పెడుతూ కనకదుర్గ వారధి అందుబాటులోకి వచ్చింది. ఎన్నో ప్రత్యేకతలతో కూడిన ఈ వారధిపై  ప్రయాణమంటే ఇక చెప్పేదేముంది. 500 కోట్ల రూపాయల వ్యయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించిన‌ కనకదుర్గ వారధితో విజయవాడ వాసుల చిరకాల కోరిక నెరవేరింది. ఇప్పటి వరకు ట్రాఫిక్‌తో అష్టకష్టాలు పడిన నగరవాసులకి‌ ఈ వారధి నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుంది. 

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల‌ మీదగా వర్చువల్ పద్దతిలో ప్రారంభమైన ఈ వారధిని చూసేందుకు నగర వాసులు పోటీ పడుతున్నారు. హైదరాబాద్‌కి వెళ్లే మార్గం కావడంతో వాహనాలు ఆపి మరీ వారధి అందాలను ప్రజలు ఆస్వాదిస్తున్నారు. ఒకవైపు కృష్ణమ్మ పరవళ్లు, మరోవైపు దసరా ఉత్సవాలతో దేదీప్యమానంగా మెరిసిపోతోంది. కనకదుర్గ వారధి విజయవాడకు మణిహారంగా ప్రజలు, పర్యాటకులతో కళకళలాడుతోంది. (బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభం)

సాయం సంధ్యవేళ  కనకదుర్గమ్మ వారధిపై వాహనాలు రయ్ రయ్ మని దూసుకుపోతుంటే చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు. విజయవాడ నుంచి హైదరబాద్ వెళ్తుంటే ఆర్టీసీ కాంప్లెక్స్ దాటి రాజీవ్ గాంధి పార్క్ వద్ద ప్రారంభమయ్యే ఫ్లై ఓవర్ భవానీపురం వరకు 2.6 కిలోమీటర్ల వరకు సాగుతుంది. ఇంతటి అందమైన ఫ్లై ఓవర్ వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు స్ధానికులు కుటుంబాలతో సహా తరలి వస్తున్నారు. కృష్ణమ్మ అందాలని సెల్పీలలో బందిస్తూ ఆనందపరవశులు అవుతున్నారు. దక్షిణ భారతదేశంలోనే నదిపై నిర్మించిన‌ అతి పెద్ద ఫ్లై ఓవర్ ట్రాఫిక్ కష్టాలు తీరుస్తూ.. కృష్ణా తీరం అందాలను ఆస్వాదించే విధంగా రూపుదిద్దుకుంది. ఈ వారధిపై ప్రయాణమంటే ఓ ప్రత్యేక అనుభూతే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు