17 నుంచి వర్చువల్‌ విధానంలో కేసుల విచారణ

12 Jan, 2022 04:45 IST|Sakshi

హైకోర్టు సహా అన్ని కోర్టుల్లోనూ ఇదే విధానం

సాక్షి, అమరావతి: కోవిడ్‌ తీవ్రత పెరుగుతుండటం, ఒమిక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేసుల విచారణ విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17వ తేదీ నుంచి కేసుల విచారణను వర్చువల్‌ (వీడియో కాన్ఫరెన్స్‌) విధానంలో చేపట్టాలని నిర్ణయించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఈ విధానమే అమల్లో ఉంటుంది. కేసుల విచారణ జాబితాలో ఏయే కేసులు ఉండాలన్నది సంబంధిత బెంచ్‌లే నిర్ణయిస్తాయి.

పిటిషన్ల దాఖలు మాత్రం ప్రస్తుతం అనుసరిస్తున్న భౌతిక రూపంలోనే ఉంటుంది. హైకోర్టు నియంత్రణలో పనిచేసే న్యాయ సేవాధికార సంస్థ, న్యాయ సేవల కమిటీ, మధ్యవర్తిత్వ, రాజీ కేంద్రాలు సైతం వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలోనే పనిచేస్తాయి. కింది కోర్టులు, ట్రిబ్యునళ్లు, పారిశ్రామిక వివాదాల కోర్టులు కూడా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే కేసుల విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది.

సాక్ష్యాల నమోదు, విచారణ ప్రక్రియను వాయిదా వేయాలని కింది కోర్టులకు స్పష్టం చేసింది. కోర్టు ప్రాంగణాల నుంచే న్యాయాధికారులు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. న్యాయాధికారులతో పాటు సిబ్బంది కూడా కోవిడ్‌ ప్రొటోకాల్స్‌ను తూచా తప్పకుండా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఏవీ రవీంద్రబాబు రెండు నోటిఫికేషన్లు జారీ చేశారు. 

మరిన్ని వార్తలు