ముంగిటకే వైద్యం

30 Jan, 2023 03:35 IST|Sakshi
అనకాపల్లి జిల్లాలో పరీక్షలు చేస్తున్న వైద్యుడు

‘ఫ్యామిలీ డాక్టర్‌’ ట్రయల్‌ రన్‌ సూపర్‌ సక్సెస్‌

మూడు నెలల్లో 27 లక్షల మందికి పైగా ఉచిత సేవలు

జీవనశైలి జబ్బులు, ఇతర వ్యాధులను గుర్తించేందుకు పరీక్షలు.. 30 ఏళ్లు దాటిన 92 శాతం మందికి స్క్రీనింగ్‌ పూర్తి

104 వాహనంతో పాటు సందర్శిస్తున్న డాక్టర్, సిబ్బంది 

ప్రత్యేక యాప్‌తో పర్యవేక్షణ 

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పసర్లపూడిలంక గ్రామానికి చెందిన పెదమల్లు సత్య రామానందం పక్షవాతం బాధితుడు. నెలకు ఒకసారి ఆస్పత్రికి వెళ్లి పరీక్షలతోపాటు మందులు కొనాల్సి రావడం, వ్యయ ప్రయాసలు ఆ నిరుపేద కుటుంబానికి పెను­భారంగా పరిణమించాయి. ఫ్యామిలీ డాక్టర్‌ విధా­నం ట్రయల్‌ రన్‌ ప్రారంభమయ్యాక వైద్యుడి­తోపాటు సిబ్బంది తమ ఇంటికే వచ్చి పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారని ఆయన భార్య సత్యవతి తెలిపింది. పేదలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానం గ్రామీణ ప్రాంతాలకు ఎంతో ఉప యోగపడుతోందని కృతజ్ఞతలు వ్యక్తం చేసింది. 

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ట్రయల్‌ రన్‌ రికార్డులు సృష్టిస్తోంది. మూడు నెలల వ్యవధిలో 27 లక్షల మందికి పైగా గ్రామీణ ప్రజలకు ఫ్యామిలీ డాక్టర్‌ ఉచితంగా వైద్య సేవలు అందచేయడం గమనార్హం. గత ఏడాది అక్టోబర్‌ 21వ తేదీన ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ట్రయల్‌ రన్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. 104 వాహనంతో పాటు డాక్టర్, వైద్య సిబ్బంది విలేజ్‌ క్లినిక్స్‌ను సందర్శించి గ్రామాల్లోనే సేవలందిస్తున్నారు.

వృద్ధులు, దివ్యాంగులు మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉచితంగా గ్రామాల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి మందులు కూడా అందచేస్తుండటంపై హర్షం వ్యక్తమవుతోంది. పక్షవాతం, నరాల బలహీనతతో నడవలేని వారి ఇళ్లకు స్వయంగా డాక్టర్లు, వైద్య సిబ్బంది వెళ్లి పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రుల్లో చికిత్స పొంది ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్న వారిని కలుసుకుని ఆరోగ్య వివరాలను వాకబు చేస్తున్నారు. 

వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌లో మందులు, ర్యాపిడ్‌ కిట్లు
ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ద్వారా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్ల­ను ప్రభుత్వం నియమించింది. 67 రకాల మందులతో పాటు 14 రకాల ర్యాపిడ్‌ కిట్లను వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌లో అందుబాటులో ఉంచారు. ప్రత్యేక యాప్‌ ద్వారా ఫ్యామిలీ డాక్టర్‌ ట్రయల్‌ రన్‌ అమలవుతున్న విధానాన్ని పర్యవేక్షిస్తు­న్నారు.

ఇప్పటివరకు సుమారు 12.70 లక్షల మందికి పరీక్షలు చేసి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. జీవనశైలి జబ్బులతో పాటు ఇతర వ్యాధులను గుర్తించేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 30 సంవత్సరాలు పైబడిన 92 శాతం మందికి స్క్రీనింగ్‌ పూర్తైంది. మిగతా 8 శాతం మందికి కూడా స్క్రీనింగ్‌ నిర్వహించేలా ఏఎన్‌ఎంలు, మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లకు అదనపు డయాగ్నస్టిక్‌ కిట్‌లు సమకూరుస్తున్నారు. 

మరిన్ని వార్తలు