అన్నలారా.. మేమెలా బతకాలి?

15 Dec, 2020 08:03 IST|Sakshi
బిక్కుబిక్కుమంటున్న భార్య సిరుసో, పిల్లలు

నలుగురు పిల్లలను ఎలా పెంచాలి..

మావోయిస్టుల చేతిలో హతమైన కృష్ణారావు భార్య సిరుసో ఆవేదన 

సాక్షి, పాడేరు: అన్నల్లారా.. అమాయక గిరిజనులను చంపకండి! నా భర్త కృష్ణారావును అన్యాయంగా హతమార్చారు. కనీసం ప్రజాకోర్టు కూడా నిర్వహించకుండానే అర్ధరాత్రి సమయంలో తీసుకువెళ్లి దారుణంగా చంపడం న్యాయమా.. అంటూ కృష్ణారావు భార్య గెమ్మెలి సిరుసో కన్నీటిపర్యంతమయ్యారు. జి.మాడుగుల మండలం వాకపల్లి గ్రామంలో పోలీసు ఇన్‌ఫార్మర్‌ నెపంతో గెమ్మెలి కృష్ణారావు అనే గిరిజనుడిని మావోయిస్టులు ఆదివారం అర్ధరాత్రి హతమార్చారు. కృష్ణారావు మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం జి.మాడుగుల సీఐ జి.డి.బాబు, ఇతర పోలీసులు పాడేరు జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి సోమవారం తీసుకువచ్చారు.  చదవండి: (మన్యంలో మావోయిస్టుల ఘాతుకం)

కృష్ణారావు మృతదేహానికి శవపరీక్షలు జరుపుతున్న సమయంలోనే మృతుడి భార్య సిరుసోతో పాటు వదిన గెమ్మెలి పార్వతమ్మ, ఇతర కుటుంబ సభ్యులంతా మావోయిస్టుల హత్యాకాండను నిరసించారు. సిరుసో మాట్లాడుతూ తన భర్త కృష్ణారావు పోలీసుల ఇన్‌ఫార్మర్‌ కాదని.. గ్రామంలో వ్యవసాయ పనులు, కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ ముద్ర వేసి చంపడం దారుణమన్నారు. తన భర్త మొదటి భార్య చనిపోయిందని, ఆమెకు పుట్టిన బిడ్డతోపాటు తనకు జన్మించిన ముగ్గురు పిల్లలు మొత్తం నలుగురిని మావోయిస్టులు అనాథలను చేశారని వాపోయారు.

మృతుడి వదిన గెమ్మెలి పార్వతమ్మ మాట్లాడుతూ మావోయిస్టులు ఎప్పుడూ ఎలాంటి హెచ్చరికలు చేయలేదని, కృష్ణారావు పోలీసు ఇన్‌ఫార్మర్‌గా పనిచేయలేదని, ప్రజాకోర్టు కూడా నిర్వహించకుండానే తన మరిదిని అన్యాయంగా చంపారని ఆందోళన వ్యక్తం చేశారు. మావోయిస్టులు అమాయక గిరిజనులను చంపవద్దని, తమలాంటి కుటుంబాలను వీధిపాలు చేయవద్దని ఆమె ప్రాధేయపడ్డారు. 

వాకపల్లికి కృష్ణారావు మృతదేహం తరలింపు
మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన గెమ్మెలి కృష్ణారావు మృతదేహానికి పాడేరు జిల్లా ఆస్పత్రిలో వైద్యులు శవపరీక్ష నిర్వహించారు. పాడేరు డీఎస్పీ డాక్టర్‌ వీబీ రాజ్‌కమల్, జి.మాడుగుల సీఐ జి.డి.బాబు, ఇతర పోలీసులంతా జిల్లా ఆస్పత్రి శవపరీక్షల విభాగానికి చేరుకున్నారు. శవపరీక్షలను దగ్గరుండి జరిపించారు. అనంతరం కృష్ణారావు మృతదేహాన్ని అంబులెన్సులో వాకపల్లికి తరలించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు