ఇంటింటికీ గిరిజన ఉత్పత్తులు 

1 Nov, 2022 03:46 IST|Sakshi

రేషన్‌ దుకాణాలు, ఎండీయూ వాహనాల ద్వారా విక్రయం 

ఎమ్మార్పీ కంటే తక్కువ రేట్లకు అందుబాటులో.. 

పైలట్‌ ప్రాజెక్టుగా విశాఖ, తిరుపతి జిల్లాల్లో అమలు 

12 రకాల గిరిజన ఉత్పత్తులతోపాటు 4 రకాల వంట నూనెల అమ్మకం  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రేషన్‌ దుకాణాలు, రేషన్‌ పంపిణీ వాహనాల (ఎండీయూ) ద్వారా గిరిజన ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. నవంబర్‌ 1వ తేదీ నుంచి పైలట్‌ ప్రాజెక్టు కింద విశాఖపట్నం, తిరుపతి జిల్లాల్లో ప్రారంభించనుంది. తొలి దశలో 290 రేషన్‌ వాహనాలు, 570 రేషన్‌ దుకాణాల్లో అమలు చేయనున్నారు. గిరిజన కో–ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్‌ కల్పించడంతోపాటు ఎమ్మార్పీ కంటే తక్కువ రేట్లకే వినియోగదారులకు అందించనున్నారు.  

ఎండీయూలకు ఆర్థిక బలం చేకూర్చేలా.. 
ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థలో 9,260 ఎండీయూ వాహనాలు సేవలందిస్తున్నాయి. రేషన్‌ డోర్‌ డెలివరీ నిమిత్తం ఎండీయూ ఆపరేటర్లకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.18 వేల రెమ్యునరేషన్‌ ఇస్తోంది. వారికి మరింత ఆర్థిక బలం చేకూర్చేందుకు ప్రభుత్వరంగ సంస్థలైన గిరిజన, ఆయిల్‌ ఫెడ్, మార్క్‌ఫెడ్‌ ఉత్పత్తులను విక్రయించుకునే వెసులుబాటు కల్పించింది. ఆయా సంస్థల నుంచి సబ్సిడీపై సరుకులను తీసుకునే ఆపరేటర్లు వాటిని ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకు ప్రజలకు విక్రయించాల్సి ఉంటుంది. ప్రతినెలా పీడీఎస్‌ బియ్యం పంపిణీలో జాప్యం లేకుండా విక్రయాలు చేసేలా చర్యలు చేపట్టింది. వినియోగదారులకు తెలిసేలా వస్తువుల ధరల పట్టికను ప్రదర్శించనున్నారు.  

విక్రయించే ఉత్పత్తులు.. 
గిరిజన కో–ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ ద్వారా తేనె, అరకు కాఫీ పొడి, వైశాఖి కాఫీ పొడి, త్రిఫల చూర్ణం, నన్నారి షర్బత్, ఆయుర్వేద సబ్బులు, చింతపండు, కుంకుడుకాయ పొడి, షికాకాయ పొడి, కారంపొడి, పసుపు, కుంకుమతోపాటు ఆయిల్‌ఫెడ్‌ నుంచి పామాయిల్, సన్‌ఫ్లవర్, రైస్‌బ్రాన్, వేరుశనగ నూనెలను అందుబాటులో ఉంచనున్నారు. 

గిరిజనులకు మేలు చేసేలా.. 
గిరిజనులకు మేలు చేసేలా ఎండీయూ వాహనాల ద్వారా వారి ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నాం. తొలుత విశాఖ, తిరుపతి జిల్లాల్లో స్పందనను బట్టి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాం. రేషన్‌ లబ్ధిదారులే కాకుండా ప్రజలందరూ ఈ ఉత్పత్తులను కొనుక్కోవచ్చు. బియ్యం ఇచ్చే సమయంలో వినియోగదారులపై ఎటువంటి ఒత్తిడి చేయకుండా విక్రయాలు చేసుకోవాలని ఎండీయూలకు సూచించాం. 
– హెచ్‌.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ   

మరిన్ని వార్తలు