Strange Disease In Manyam: వింత వ్యాధి కలకలం?

16 Apr, 2022 12:45 IST|Sakshi
కంకణాపల్లి గ్రామం   

పాచిపెంట మండలంలో ఈ నెల 13న యువకుడి మృతి 

ఎవరు భయాందోళనలకు గురికావద్దు– ఐటీడీఏ పీఓ కూర్మనాథ్‌ 

సాలూరు: మన్యంలో వింత వ్యాధి మళ్లీ విజృంభిస్తోందని గిరిజనుల్లో ఆందోళన  మొదలైంది. ఈ నెల 13న పాచిపెంట మండలంలోని  కర్రివలస పంచాయతీ కంకణాపల్లి గ్రామంలో  వింత వ్యాధితో మరణాలు సంభవించాయి. ఈ నెల  రెండవ  వారంలో  గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కాళ్లు, చేతులు, ముఖం పొంగి బాగా నీరసించిపోయారు. వెంటనే వారు పాచిపెంట పీహెచ్‌సీకి  వెళ్లగా సాలూరు  సీహెచ్‌సీకి రిఫర్‌ చేశారు. బాధితుల్లో  గమ్మెల ప్రశాంత్‌ (21) పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం ప్రభుత్వాస్పత్రికి రిఫర్‌ చేయగా అక్కడ చికిత్స పొందుతూ ప్రశాంత్‌ ఈనెల 13న మరణించాడు. సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. కాగా సుమారు పదిమంది  ఈ విధంగానే భాదపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.
   
గ్రామస్తుల్లో భయాందోళన  
వింత వ్యాధితో సంభవిస్తున్న మరణాలపై గిరిజనుల్లో భయాందోళనలు అధికమవుతున్నాయి. ఈ విథమైన మరణాలపై  గతేడాది జనవరి19వ తేదీన మన్యంలో మరణ మృదంగం శీర్షికన సాక్షిలో  కథనం ప్రచురితమైంది. దీనిపై  ఐటీడీఏ పీఒ కూర్మనాథ్‌ స్పందించి  గ్రామంలో పర్యటించి వైద్యసేవలు ముమ్మరం చేశారు. 

కానరాని వింతవ్యాధి లక్షణాలు 
అయితే మళ్లీ ఈ  నెలలో ఆ తరహా వ్యాధి ప్రబలడంతో పాచిపెంట పీహెచ్‌సీ  వైద్యాధికారిణి డాక్టర్‌ పీవీ లక్ష్మిని వివరణ కోరగా, ఈ విషయం తమ  దృష్టికి వచ్చిందని, గ్రామంలో రెండు రోజులుగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. సాధారణ అనారోగ్య లక్షణాలు తప్ప వింత వ్యాధి లక్షణాలు ఎవరికి  లేనట్లు గుర్తించామన్నారు.త్వరలో అందరికీ  వైద్యపరీక్షలు నిర్వహిస్తామన్నారు. తాగునీరు సమస్య కారణం కావచ్చన్న అనుమానంతో  తాగునీటి పరీక్షలు నిర్వహించగా  ఎటువంటి సమస్య లేదని గుర్తించినట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ వెంకట చినఅప్పలనాయుడు తెలిపారు. దీనిపై ఐటీడీఏ పీఓ కూర్మనా«థ్‌  వివరణ కోరగా, గ్రామంలో  ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశామన్నారు.

గ్రామంలో వైద్యశిబిరాలు నిర్వహించినట్లు వైద్యాధికారులు చెప్పారని, ప్రజలెవరూ భయాందోళనలకు గురికావద్దని, తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా సమీప ఒడిశా నుంచి  వస్తున్న సారా మన్యంలో ఏరులై పారుతున్న నేపథ్యంలో సారా తాగడం   ఈ విధమైన వ్యాధులకు కారణం కావచ్చని  పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా అధికారులు తక్షణమే స్పందించి  గ్రామంలో మెరుగైన వైద్యసేవలు అందించాలని, మన్యాల్లో సారా నివారణకు  చర్యలు తీసుకోవాలని  ప్రజలు కోరుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు