మూడేళ్లుగా.. అదే జోరుగా..

24 Jul, 2022 03:42 IST|Sakshi

తుంగభద్ర చరిత్రలో తొలిసారి జూలై మూడో వారానికే 172.89 టీఎంసీలు 

అక్టోబర్‌ వరకు డ్యామ్‌లోకి వరద కొనసాగే అవకాశం 

టీబీ డ్యామ్‌ కింద మూడు రాష్ట్రాల్లో 17,33,878 ఎకరాల ఆయకట్టు 

గత మూడేళ్లకంటే ఈ ఏడాది నీటి లభ్యత అధికంగా ఉంటుందని అంచనా

మూడు రాష్ట్రాల ఆయకట్టు రైతులకు మేలు 

సాక్షి, అమరావతి: నీటి లభ్యతలో కృష్ణాతో ఉప నది తుంగభద్ర పోటీ పడుతోంది. చరిత్రలో లేని విధంగా జూలై మూడో వారానికే తుంగభద్ర డ్యామ్‌లోకి 172.89 టీఎంసీల ప్రవాహం వచ్చింది. నైరుతి రుతు పవనాల ప్రభావం వల్ల కురిసే వర్షాలతో అక్టోబర్‌ వరకు డ్యామ్‌లోకి వరద కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత మూడేళ్లతో పోల్చితే ఈ ఏడాది తుంగభద్రలో నీటి లభ్యత అధికంగా ఉంటుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది తుంగభద్ర డ్యామ్, దిగువన ప్రాజెక్టులపై ఆధారపడ్డ మూడు రాష్ట్రాల్లోని 17,33,878 ఎకరాల ఆయకట్టు రైతులకు మేలు చేస్తుందని చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర 1958లో పూర్తయింది. డ్యామ్‌లో 230 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్‌ ట్రిబ్యునల్‌ ఆంధ్రపద్రేశ్‌కు 72 టీఎంసీలు (హెచ్చెల్సీ 32.5, ఎల్లెల్సీ 29.5, కేసీ కెనాల్‌కు అసిస్టెన్స్‌), తెలంగాణకు 6.51 (ఆర్డీఎస్‌కు అసిస్టెన్స్‌), కర్ణాటకకు 151.49 టీఎంసీలు పంపిణీ చేసింది. 1980–81లో మాత్రమే ట్రిబ్యునల్‌ కేటాయించిన దానికంటే 1.383 టీఎంసీలు అధికంగా అంటే 231.383 టీఎంసీలను డ్యామ్‌ ద్వారా మూడు రాష్ట్రాలు వినియోగించుకొన్నాయి.

డ్యామ్‌లో పూడిక పేరుకుపోతుండటంతో నిల్వ సామర్థ్యం తగ్గింది. దీంతో బోర్డు నీటి లభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలకు జలాలను పంపిణీ చేస్తోంది.  గత మూడేళ్లుగా తుంగభద్ర డ్యామ్, దాని దిగువన ఉన్న రాయబసవన, విజయనగర చానల్స్, ఆర్డీఎస్‌(రాజోలిబండ డైవర్షన్‌ స్కీం), కేసీ కెనాల్‌కు నీటిని సరఫరా చేసే సుంకేశుల బ్యారేజీ వద్ద నీటి లభ్యత మెరుగ్గా ఉంది. డ్యామ్‌ చరిత్రలో ఈ ఏడాదే అధికంగా ప్రవాహం వచ్చింది. డ్యామ్‌లో గరిష్ట స్థాయిలో 104.5 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న సుమారు వంద టీఎంసీలను దిగువకు విడుదల చేశారు. ఈ జలాలు సుంకేశుల బ్యారేజ్‌ మీదుగా శ్రీశైలం 
ప్రాజెక్టుకు చేరుతున్నాయి. 

పంటల సాగులో రైతులు నిమగ్నం 
తుంగభద్ర డ్యామ్‌పై నేరుగా ఆధారపడి ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లెల్సీ (దిగువ కాలువ) 1,57,062 ఎకరాలు, హెచ్చెల్సీ (ఎగువ కాలువ) కింద 2,84,992 ఎకరాలు, కర్ణాటకలో 8,96,456 ఎకరాలు.. మొత్తం 13,38,510 ఎకరాల ఆయకట్టు ఉంది. డ్యామ్‌ దిగువన రాయబసవన, విజయనగర చానల్స్‌ కింద కర్ణాటకలో 30,368 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్‌లో కేసీ కెనాల్‌ కింద 2,78,000 ఎకరాలు, తెలంగాణలో ఆర్డీఎస్‌ కింద 87,000 ఎకరాలు వెరసి 3,95,368 ఎకరాల ఆయకట్టు ఉంది. అంటే.. డ్యామ్‌పై ఆధారపడిన మొత్తం ఆయకట్టు  17,33,878 ఎకరాలు. డ్యామ్‌ ద్వారా నీటిని విడుదల చేస్తుండటంతో ఆయకట్టు రైతులు పంటల సాగులో  నిమగ్నమయ్యారు.  

మరిన్ని వార్తలు