‘పాలమూరు–రంగారెడ్డి’లో.. ఉల్లంఘనలు నిజమే

2 Oct, 2021 04:48 IST|Sakshi

సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో తెలంగాణ సర్కార్‌ పర్యావరణ నిబంధనలను అడ్డగోలుగా ఉల్లంఘించినట్లు తేల్చిచెబుతూ జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ), చెన్నై బెంచ్‌కు శుక్రవారం జాయింట్‌ కమిటీ నివేదిక ఇచ్చింది. ముందస్తు పనులు చేపట్టడానికి మాత్రమే  కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతిస్తే.. 120 టీఎంసీలు తరలించే పూర్తిస్థాయి నిర్మాణ పనులు చేపట్టిందని నివేదికలో స్పష్టంచేసింది. తనిఖీల సమయంలో రిజర్వాయర్ల నిర్మాణం కొనసాగుతోందని తేల్చిచెప్పింది.

ఇలా 1,916 రోజులపాటు నిబంధనలకు వ్యతిరేకంగా పనులు చేపట్టారని.. ఇది ఈఐఏ (పర్యావరణ ప్రభావ అంచనా–ఎన్విరాన్‌మెంటల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌) –2006 ప్రకటనలో నిబంధనలను ఉల్లంఘించడమేనని కుండబద్దలు కొట్టింది. పర్యావరణ అనుమతి తీసుకోకుండానే ప్రాజెక్టు పనులు చేపట్టడంవల్ల పర్యావరణానికి విఘాతం కలిగిందని.. తక్షణ పరిహారం కింద రూ.3,70,87,500లను తెలంగాణ సర్కార్‌ నుంచి వసూలుచేయాలని జాయింట్‌ కమిటీ సూచించింది. ఇప్పటికే దెబ్బతిన్న పర్యావరణాన్ని పునరుద్ధరించేందుకు చేసిన సిఫార్సుల అమలుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేయాలని పేర్కొంది. ఈ నివేదికపై శుక్రవారం ఎన్జీటీ విచారణ చేపట్టింది. 

ప్రాజెక్టు నిలిపివేసేలా ఆదేశాలివ్వండి
పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని కమిటీ తేల్చిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టు నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ల తరఫున తమిళనాడు మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ రామన్‌ కోరారు. దీంతో సంయుక్త కమిటీ నివేదిక శుక్రవారం ఉదయమే అందినందున దానిని పూర్తిగా చదవాల్సి ఉందని తెలంగాణ ప్రభుత్వం తరఫు అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రాంచందర్‌రావు తెలిపారు. ఆరేళ్ల క్రితం నాటి ప్రాజెక్టుపై ఇప్పుడు ఫిర్యాదు చేస్తే విచారించకూడదన్నారు.

పిటిషన్‌కు విచారణ అర్హతలేదని, ఈ తరహా పిటిషన్లు విచారించడానికి ఎన్జీటీకి పరిధిలేదని తెలిపారు. నివేదికపై ప్రాథమిక అభ్యంతరాలున్నాయని వాటిపై వాదనలు చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే, ప్రాజెక్టు ఆరేళ్ల నాటిదైనా ప్రస్తుతం పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగినట్లేనని రామన్‌ స్పష్టంచేశారు. దీంతో వచ్చే మంగళవారం 5వ తేదీలోపు వైఖరి చెప్పాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం అదే రోజుకు విచారణను వాయిదా వేసింది. ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్, న్యాయవాది డి. మాధురిరెడ్డిలు హాజరయ్యారు.

జాయింట్‌ కమిటీ నివేదిక ముఖ్యాంశాలివీ..
శ్రీశైలం జలాశయం నుంచి రెండు నెలల్లో 120 టీఎంసీలను తరలించి.. 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1,226 గ్రామాలకు తాగునీరు అందించడానికి రూ.35,200 కోట్లతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను తెలంగాణ సర్కార్‌ చేపట్టింది. 
తాగునీటి కోసం శ్రీశైలం జలాశయం నుంచి 90 టీఎంసీలను తరలించేందుకు ఈ ఎత్తిపోతలను చేపట్టామని.. ఇందుకు అనుమతివ్వాలని 2017లో కేంద్రాన్ని తెలంగాణ కోరింది. దీంతో ముందస్తు నిర్మాణ పనులు మాత్రమే చేపట్టాలంటూ కేంద్రం షరతులతో అనుమతిచ్చింది.
కానీ.. తెలంగాణ సర్కార్‌ 120 టీఎంసీలు తరలించేలా.. 4,97,976 లక్షల హెక్టార్లకు నీళ్లందించేలా ప్రాజెక్టు పనులు చేపట్టింది. నిజానికి 1,226 గ్రామాలకు తాగునీటి కోసం 7.15 టీఎంసీలు సరిపోతాయి.
ఈ ప్రాజెక్టు అంతర్భాగంగా నార్లాపూర్, ఏదులా, వట్టెం, కర్వెన, ఉదండాపూర్‌లో68 టీఎంసీలు నిల్వచేసేలా  రిజర్వాయర్లు నిర్మిస్తోంది. 
ఈఐఏ–2006 ప్రకటన మేరకు ఈ ప్రాజెక్టు పనులకు పర్యావరణ అనుమతి తీసుకోవాల్సిందే. కానీ.. అవేమీ తీసుకోకుండా తెలంగాణ చట్టాన్ని ఉల్లంఘించింది. è అలాగే, నార్లాపూర్‌ రిజర్వాయర్‌ వద్ద రెండు టన్నెళ్ల పనులు జరుగుతున్నాయి. దీనివల్ల పర్యావరణం దెబ్బతింది.
దీనివల్ల తక్షణ పరిహారం కింద రూ.3.70 కోట్లను తెలంగాణ సర్కార్‌ నుంచి వసూలుచేయాలి.
కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో మెజారిటీ సభ్యులు సాగునీటి అవసరాల నిమిత్తం ప్రాజెక్టు అని నివేదిక ఇవ్వగా.. మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు, గనుల శాఖ సహాయ డైరెక్టర్లు మాత్రం తాగునీటి అవసరాలకే ప్రాజెక్టు నిర్మాణం అని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు