టీఎస్‌ఆర్టీసీతో తెగని పంచాయితీ

27 Sep, 2020 03:44 IST|Sakshi

కర్ణాటక, మహారాష్ట్రకు బస్సులు తిప్పేందుకు సై

ఏపీకి నడిపేందుకు ససేమిరా

ఆ రెండు రాష్ట్రాలతో టీఎస్‌ఆర్టీసీ ఒప్పందం సాంకేతికంగా కుదరదంటున్న ఏపీఎస్‌ఆర్టీసీ

సాక్షి, అమరావతి: తెలంగాణ, ఏపీ మధ్య అంతర్‌ రాష్ట్ర సర్వీసులను నడిపే విషయంలో టీఎస్‌ఆర్టీసీ మొండికేస్తోంది. కర్ణాటక, మహారాష్ట్రలతో అంతర్‌ రాష్ట్ర ఒప్పందం పునరుద్ధరించుకునేందుకు రెడీ అయిన టీఎస్‌ఆర్టీసీ ఏపీతో ఒప్పందానికి మాత్రం ససేమిరా అంటోంది. లాక్‌డౌన్‌కు ముందు కర్ణాటక, మహారాష్ట్రకు తిప్పుతున్న బస్సుల్ని కిలోమీటర్ల ప్రకారం సోమవారం నుంచి నడిపేందుకు టీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది.

ఏపీతో మొండి వాదన
► తెలంగాణ, ఏపీ మధ్య అంతర్‌ రాష్ట్ర సర్వీసులు నడిపే విషయంలో టీఎస్‌ఆర్టీసీ మొండి వాదనకు దిగుతోంది. 
► ఏపీఎస్‌ఆర్టీసీ లక్ష కిలోమీటర్లు కచ్చితంగా తగ్గించుకోవాలని తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే.
► ఏపీకి బస్సులు తిప్పకపోవడం వల్ల టీఎస్‌ఆర్టీసీకి రోజుకు రూ.2 కోట్ల నష్టం వాటిల్లుతోంది.
► అయినా ఏపీతో మాత్రం ఒప్పందం చేసుకునేందుకు తెలంగాణ అధికారులు అంగీకరించడం లేదు. 

ఆ ఒప్పందం సాంకేతికంగా కుదరదు
► కర్ణాటక, మహారాష్ట్రలతో టీఎస్‌ఆర్టీసీ కుదుర్చుకున్న అంతర్‌ రాష్ట్ర ఒప్పందం సాంకేతికంగా కుదరదని ఏపీఎస్‌ఆర్టీసీ స్పష్టం చేస్తోంది. 
► ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినప్పటికీ ఆర్టీసీ విభజన ఇంకా జరగలేదు. 
► అందువల్ల ఇతర రాష్ట్రాలతో అంతర్‌ రాష్ట్ర ఒప్పందం ఏపీఎస్‌ఆర్టీసీ పేరు మీదే ఉంది.
► ఇప్పుడు టీఎస్‌ఆర్టీసీ కర్ణాటక, మహారాష్ట్రలతో ఏపీఎస్‌ఆర్టీసీ పేరు మీదే ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుందని ఏపీ స్పష్టం చేస్తోంది.
► తెలంగాణ మాత్రం రెండు రాష్ట్రాల కార్యకలాపాలు వేర్వేరుగా జరుగుతున్నాయి కాబట్టి.. సాంకేతికంగా అడ్డు పెట్టినా కుదరదని టీఎస్‌ఆర్టీసీ వాదిస్తోంది.

ఏపీ వాదన ఇదీ..
► టీఎస్‌ఆర్టీసీ తగ్గించుకోవాలంటున్న లక్ష కిలోమీటర్లలో 50 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటాం. 
► మిగిలిన 50 వేల కిలోమీటర్లు టీఎస్‌ఆర్టీసీ పెంచుకుంటే సామరస్యంగా ఉంటుంది.
► మిగిలిన రూట్లలో బస్సుల్ని పెంచకుండా హైదరాబాద్‌–విజయవాడ రూట్‌లో పెంచుతామనడం సరికాదు.
► టీఎస్‌ఆర్టీసీ తీరు వల్ల ప్రైవేటు బస్సులు పెరిగాయి. ఆపరేటర్లు ఒకే పర్మిట్‌తో రెండు వైపులా బస్సుల్ని తిప్పుతున్నారు. దీనివల్ల ప్రభుత్వం భారీ ఆదాయం కోల్పోతుంది.
► గతంలో ప్రైవేటు బస్సుల వల్ల రూ.వెయ్యి కోట్లు ఆదాయం కోల్పోతున్నామన్న టీఎస్‌ఆర్టీసీ ఇప్పుడు ప్రైవేటు బస్సులు పెరిగినా.. తెలంగాణ ఆదాయం కోల్పోతున్నా.. ఎందుకు పట్టించుకోవడం లేదు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా