ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ఘోర ప్రమాదం 

30 Jan, 2023 04:56 IST|Sakshi
ప్రమాదం జరిగిన సమయంలో కిందకి రాలిపడుతున్న సైడ్‌వాల్‌ రాళ్లు

శ్రీశైలం డ్యామ్‌ వద్ద బ్రేకులు 

పడక రక్షణ గోడను ఢీకొన్న బస్సు 

శ్రీశైలం ప్రాజెక్ట్‌/దోమలపెంట: శ్రీశైలం నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో శ్రీశైలం నుంచి మహబూబ్‌నగర్‌ బయలుదేరిన ఆర్టీసీ అద్దె బస్సు శ్రీశైలం డ్యామ్‌ సమీపంలోని తలకాయ టర్నింగ్‌ వద్ద ప్రమాదానికి గురైంది.

వేగంగా వస్తున్న బస్సు మలుపు వద్ద సక్రమంగా ప్రయాణించక ఎదురుగా ఉన్న సైడ్‌వాల్‌ను ఢీకొట్టింది. ప్రమాదాలు తరచూ జరిగే స్థలం కాబట్టి ఆర్‌ అండ్‌ బీ అధికారులు ఆ మలుపుల వద్ద ఇనుప గడ్డర్లతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్‌ను ఢీకొన్న బస్సు అక్కడే నిలిచిపోయింది. లేదంటే కింద ఉన్న లోయలోకి పడిపోయి ఘోర ప్రమాదం జరిగి ఉండేది.

ప్రమాద సమయంలో 30 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్టు సమాచారం. బస్సు ఏమాత్రం ముందుకెళ్లినా వంద అడుగుల లోతున ఉన్న లోయలో పడేదని ప్రయాణికులు తెలిపారు. బ్రేక్‌ పడకపోవడం వల్లే బస్సు ముందుకు దూసుకెళ్లినట్టు తెలిసింది. ప్రమాదం తర్వాత డ్రైవర్‌ చాకచక్యంగా బస్సును వెనక్కి మళ్లించి ప్రయాణికులతో సహా మహబూబ్‌నగర్‌ వెళ్లిపోయారు.   

మరిన్ని వార్తలు