మార్చిలో 14 లక్షల దర్శన టికెట్లు

23 Feb, 2022 04:43 IST|Sakshi

రోజుకు 25 వేలమందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం

20 వేల మందికి సర్వదర్శనం

నేడు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ

ఈనెలలో దర్శనానికి అందుబాటులో అదనపు టికెట్లు 

తిరుమల/తిరుపతి ఎడ్యుకేషన్‌: కోవిడ్‌ పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తున్న నేపథ్యంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దాదాపు రెండేళ్లుగా ఆంక్షల నడుమ దర్శనాల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎక్కువమంది ప్రజలకు టీకాలు వేయడం, వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో టీటీడీ మరింతమంది భక్తులకు దర్శనం కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. మార్చి నెలలో దాదాపు 14 లక్షల మంది భక్తులకు సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్‌ఈడీ) కల్పించేందుకు టికెట్లు జారీచేయనుంది. మార్చిలో రోజుకు 25 వేల వంతున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను నేడు (బుధవారం) ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అలాగే మార్చిలో రోజుకు 20 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలోని కౌంటర్ల ద్వారా ఆఫ్‌లైన్‌ పద్ధతిలో కేటాయించనుంది. 

రేపటి నుంచి ఈనెల 28 వరకు అదనపు కోటా
ఈనెల 24 (గురువారం) నుంచి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 13 వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ బుధవారం ఆన్‌లైన్‌లో ఉంచనుంది. ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు ఐదువేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల్లోని కౌంటర్ల వద్ద ఇవ్వనుంది. 

మార్చి 10న విదేశీ నాణేల ఈ–వేలం
తిరుమల శ్రీవారికి భక్తులు కానుకగా సమర్పించిన యూఎస్‌ఏ, మలేసియా దేశాలకు చెందిన నాణేలను మార్చి 10వ తేదీన ఈ–వేలం వేయనున్నట్లు టీటీడీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా మలేసియా నాణేలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, యూఎస్‌ఏ నాణేలను మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ–వేలం వేయనున్నట్లు పేర్కొంది. మరిన్ని వివరాలకు మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌ (వేలం) కార్యాలయాన్ని 0877–2264429 నంబరులో సంప్రదించాలని, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కేఓఎన్‌యూజీఓఎల్‌యూ.ఏపీ.జీఓవీ.ఇన్‌ / డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఐఆర్‌యూఎంఏఎల్‌ఏ.ఓఆర్‌జీ వెబ్‌సైట్లలో చూడాలని కోరింది.   

మరిన్ని వార్తలు