శ్రీవారి భక్తులకు మరో శుభవార్త

24 Mar, 2021 08:40 IST|Sakshi

వధూవరులకు రెండు గ్రాముల బంగారు తాళిబొట్టు

శ్రీవారి సమక్షంలో పెళ్లిళ్లకుఖరారైన సుముహూర్తం

మహోన్నత కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం

దశాబ్ద కాలంగా నిలిచిపోయిన ‘కల్యాణమస్తు’కు టీటీడీ మళ్లీ శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో శ్రీవారి భక్తులకు మరో శుభవార్తను అందించింది. వైకుంఠనాథుని సాక్షిగా ఒక్కటయ్యే జంటలకు రెండు గ్రాముల బంగారు తాళిబొట్టును అందించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ మహోన్నత కార్యక్రమానికి సుముహూర్తం ఖరారు చేసింది.  
 
సాక్షి,తిరుపతి: ప్రతిష్టాత్మకమైన కల్యాణమస్తు కార్యక్రమానికి టీటీడీ ముహూర్తం ఖరారు చేసింది. అందులో భాగంగా పవిత్ర లగ్నపత్రికను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలను ఇప్పటికే పూర్తి చేసింది. అలాగే కల్యాణమస్తులో ఒకటయ్యే జంటలకు అందించే తాళిబొట్టును ఒక గ్రాము నుంచి రెండు గ్రాములకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం  టీటీడీ ట్రెజరీలో సిద్ధంగా ఉన్న 20వేల తాళిబొట్లను వినియోగించుకోనుంది. 

2007లో శ్రీకారం
శ్రీవారి సమక్షంలో పేద హిందువులు వివాహం చేసుకునేలా 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ కల్యాణమస్తు కార్యక్రమం ప్రారంభించింది. ఉమ్మడి రాష్ట్రంలో కల్యాణమస్తు ఘనంగా నిర్వహించేవారు. కలియుగ ప్రత్యక్షదైవం ఆశీస్సులు ఉంటాయనే భావనతో వేలాది జంటలు ఈ మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములయ్యేవి. ఈ సందర్భంగా వధూవరులకు టీటీడీ తరఫున నూతన వస్త్రాలు, బంగారు తాళిబొట్టును అందించడమే కాకుండా 50మంది బంధువులకు భోజనాలను వితరణ చేసేవారు. 2007 నుంచి 2011 వరకు ఏటా రెండు విడతలుగా కల్యాణమస్తును నిర్వహించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమం నిలిచిపోయింది. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కల్యాణమస్తును పునఃప్రారంభించాలని నిర్ణయించారు. 

ముహూర్తం ఖరారు
కల్యాణమస్తును వైభవోపేతంగా నిర్వహించేందుకు టీటీడీ ముహూర్తం ఖరారు చేసింది. మే 28, అక్టోబర్‌ 30, నవంబర్‌ 17వ తేదీల్లో కళ్యాణమస్తు నిర్వహిస్తామని ఈఓ జవహర్‌ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఎక్కడ కార్యక్రమాలను జరిపించాలో పాలకమండలి సమావేశంలో నిర్ణయిస్తామని వెల్లడించారు.

(చదవండి: తిరుమల దర్శన నిర్వహణ ప్రశంసనీయం: వెంకయ్య)

మరిన్ని వార్తలు