సీఎం జగన్‌కు టీటీడీ ఆహ్వానం

17 Sep, 2020 19:30 IST|Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌కు టీటీడీ ఆహ్వానం

సాక్షి,అమరావతి/తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ఏటా నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌లు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వారు సీఎం వైఎస్‌ జగన్‌ను గురువారం కలిశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌కు శ్రీవారి ప్రసాదాలు అందజేసి, బ్రహ్మోత్సవాలకు హాజరై సంప్రదాయం ప్రకారం స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించాలని ఆహ్వానించారు. వారి వెంట టీటీడీ అడిషనల్‌ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఉన్నారు.   (చదవండి: రూ. 23.78 కోట్ల జీఎస్టీ రద్దు చేయండి)

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ 
ఈ నెల 19 నుంచి 27 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం శుక్రవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య అంకురార్పణ జరగనుంది. ఈ సందర్భంగా వేదపండితులు శ్రీ విష్వక్సేనుల వారిని రంగనాయకుల మండపంలోకి వేంచేపు చేస్తారు. వైఖానస ఆగమనాన్ని పాటించే తిరుమల, ఇతర ఆలయాల్లో ఉత్సవాలకు ఒకరోజు ముందు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే, బ్రహ్మోత్సవాలకు 19న సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు పెద్దశేష వాహన సేవ ఉంటుంది. కరోనా నేపథ్యంలో ఈ బ్రహ్మోత్సవాలను టీటీడీ ఏకాంతంగా నిర్వహించనుంది.

టీటీడీలో కొత్తగా 8 పోస్టులు
మరోవైపు అమరావతి బోర్డ్ నిర్ణయం మేరకు ప్రభుత్వం టీటీడీలో కొత్తగా 8 పోస్టులు సృష్టించింది. టీటీడీ నగలు విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు బోర్డు ఇప్పటికే కొత్తగా చీఫ్ జ్యుయెలరీ ఆఫీసర్, జ్యుయెలరీ ఆఫీసర్, రెండు ఏఈఓ, 4 జ్యుయెలరీ అప్రైజర్ పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

మరిన్ని వార్తలు