అలసత్వం, అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు

20 Jan, 2021 21:00 IST|Sakshi

కాకినాడ: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల కష్టాలను స్వయంగా చూసి, నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ.. భరోసా కల్పించి, అధికారం చేపట్టిన నాటి నుంచి 90 శాతానికి పైగా హామీలను నెరవేర్చారని టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. అధికారంలోని వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే మేనిఫెస్టోలోని దాదాపు ప్రతి హామీని నెరవేర్చి, దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని పనిని సుసాధ్యం చేసి చూపించారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీఎం జగన్‌ ఆదర్శంగా నిలిచారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. 

ప్రతిపక్షం ఎన్ని కుట్రలు చేసినా పేదల సొంతింటి కల నెరవేర్చాలన్న దృడ సంకల్పంతో అన్ని అడ్డంకుల్ని తొలగించుకొని ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో మూడు లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కాకినాడ సమీపంలోని నేమాం బీచ్‌ రోడ్‌లో వైఎస్‌ జగన్మోహనపురం నిర్మించడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. 103 ఎకరాల్లో నిర్మించే ఈ ఊరిలో మూడు వేల మందికి పట్టాలిస్తున్నామని ఆయన తెలియజేశారు. అలసత్వం, అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు