టికెట్ల ఇక్కట్లకు చెక్‌! 

5 Sep, 2021 04:05 IST|Sakshi

క్లౌడ్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీలోకి టీటీడీ 

ఆన్‌లైన్‌ సమస్యలు అధిగమించేలా..సర్వర్‌ సామర్థ్యం పెంచేలా చర్యలు 

ఇకపై భక్తులకు సులువుగా దక్కనున్న దర్శన టికెట్లు 

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం టికెట్ల ఆన్‌లైన్‌ బుకింగ్‌ విషయంలో ఎదురవుతోన్న ఇబ్బందులను అధిగమించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చర్యలు చేపట్టింది. ఇందుకుగాను క్లౌడ్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీని వాడుకోవాలని నిర్ణయించింది. మరో నెల రోజుల్లో ఈ టెక్నాలజీని వినియోగించి దర్శన టికెట్ల బుకింగ్‌ సమయంలో ఎదురవుతోన్న ఇబ్బందులను సరిచేయనుంది. 

► శ్రీవారి దర్శనం కోసం టీటీడీ ప్రతి నెలా విడుదల చేస్తోన్న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను బుక్‌ చేసుకోవడంలో సామాన్యులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకేసారి 3 లక్షల మందికిపైగా భక్తులు టీటీడీ వెబ్‌సైట్‌ను హిట్‌ చేస్తుండటంతో తరచూ సాంకేతిక సమస్యలు (సర్వర్‌ ట్రాఫిక్‌ లాంటివి) ఉత్పన్నమవుతున్నాయి. హై ఇంటర్నెట్‌ స్పీడ్‌ ఉంటే తప్ప గ్రామీణ ప్రాంతాలు, సామాన్య భక్తులకు దర్శనం టికెట్లు లభించడం లేదు. ఈ విషయమై ప్రతి నెలా టీటీడీ ఉన్నతాధికారులకు భక్తుల నుంచి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. 

కోవిడ్‌ నేపథ్యంలో పెరిగిన డిమాండ్‌  
కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి నేపథ్యంలో ఉచిత దర్శనం టికెట్లు రద్దు చేయడంతో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ప్రస్తుతం రోజుకు 8 వేల టికెట్ల చొప్పున రాబోయే నెల కోసం ప్రతి నెల 20 నుంచి 25వ తేదీలోగా 2 లక్షల 40 వేల టికెట్లు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేస్తుంది. విడుదలైన 2 నుంచి 3 గంటల్లోపే నెల కోటాకు సంబంధించిన టికెట్లు మొత్తం బుక్‌ అయిపోతున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాలు, ఇంటర్నెట్‌ స్పీడ్‌ తక్కువగా ఉన్న వారికి టికెట్లు దొరకడం లేదనే ఫిర్యాదులు రావడంతో టీటీడీ దీనిపై దృష్టి సారించింది. సామాన్య భక్తులకు కూడా రూ.300 దర్శనం టికెట్లు అందేలా చేయాలని టాటా కన్సల్‌టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సంస్థతో మాట్లాడి ఇటీవల సర్వర్‌ సామర్థ్యం పెంచేలా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ భక్తుల డిమాండ్‌ను టీటీడీ అందుకో లేకపోతోంది.

నెల రోజుల్లో అందుబాటులోకి ‘క్లౌడ్‌’
ఇకపై ఇంటర్‌నెట్‌ స్పీడ్‌తో సంబంధం లేకుండా క్లౌడ్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీని వాడుకోవాలని టీటీడీ నిర్ణయించింది. ఈ టెక్నాలజీతో టీటీడీ వెబ్‌సైట్‌ను ఒకేసారి లక్షల మంది హిట్‌ చేసినా..ఆటో స్కేలింగ్‌ పద్ధతి ద్వారా సీపీయూ వర్చువల్‌ స్కేల్‌ అప్, స్కేల్‌ డౌన్‌తో ఆన్‌లైన్‌ ఇబ్బందులకు ఏ మాత్రం అవకాశం ఉండదని టీటీడీ భావిస్తోంది. ఒకవేళ ఆన్‌లైన్‌ సమస్య వచ్చినా మైక్రో సెకన్లలోనే తిరిగి పనిచేసేలా సాంకేతికత సమకూరుతుందని అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన సాంకేతిక పనులు కూడా టీటీడీ ప్రారంభించింది. మరో నెల రోజుల్లో క్లౌడ్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ వినియోగించి ఆన్‌లైన్‌లో రూ.300 దర్శనం టికెట్లు జారీ చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే సామాన్య భక్తులకు రూ.300 దర్శనం టికెట్లు సులువుగా లభిస్తాయని టీటీడీ అధికారులు తెలిపారు.  

మరిన్ని వార్తలు