శ్రీవారి భక్తులకు సులభంగా అద్దె గదులు

23 Jul, 2021 00:57 IST|Sakshi

టీటీడీ ఈవో డాక్టర్‌ జవహర్‌రెడ్డి 

తిరుమల: శ్రీవారి భక్తులకు సులభంగా, త్వరితగతిన అద్దె గదులు కల్పించాలని టీటీడీ ఈవో డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలో గురువారం ఆయన వసతి కల్పనకు నూతనంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌పై అధికారులతో సమీక్షించారు. ఈవో మాట్లాడుతూ తిరుమలలో అద్దె గది కోసం ఆన్‌లైన్లో రిజర్వేషన్‌ చేసుకున్న భక్తులు సంబంధిత గదుల స్లిప్పులను తిరుపతిలోనే స్కాన్‌ చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం అలిపిరి టోల్‌గేట్, అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

అలిపిరి టోల్‌గేట్‌ నుంచి తిరుమలకు రోడ్డు మార్గంలో వెళ్లేవారికి స్లిప్పులు స్కాన్‌ చేసుకున్న 30 నిమిషాల్లో, అలిపిరి నడకమార్గంలో వెళ్లేవారికి 3 గంటల్లో, శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లేవారికి గంటలో ఎస్‌ఎంఎస్‌లు వస్తాయన్నారు. భక్తులు నేరుగా సంబంధిత ఉప విచారణ కార్యాలయానికి వెళ్లి గదులు పొందొచ్చని సూచించారు. అనంతరం టీటీడీ కాల్‌ సెంటర్‌ ద్వారా వస్తున్న పలు ఫిర్యాదులను విభాగాల వారీగా సమీక్షించారు. అంతకుముందు రిసెప్షన్‌ అధికారులు నూతనంగా రూపొందించిన అకామిడేషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌పై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఈవోకు వివరించారు. అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, సీఈ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు