విమర్శలు చేయడమే పనిగా పెట్టుకోవద్దు: టీటీడీ ఈవో

5 Jun, 2021 13:16 IST|Sakshi

ఆంజనేయస్వామి జన్మస్థలం అంజనాద్రినే

గోవిందానంద స్వామి వాదనలో వాస్తవాలు లేవు

టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి

సాక్షి, తిరుపతి: ఆంజనేయస్వామి జన్మస్థలం అంజనాద్రినే అని.. టీటీడీ అన్ని పరిశోధించే ఈ ప్రకటన చేసిందని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గోవిందానంద స్వామి ఏదేదో మాట్లాడుతున్నారని.. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారన్నారు. పురాణాలను కూడా ఆయన విశ్వసించడం లేదన్నారు. సరైన ఆధారాలుంటే ఎవరైనా తీసుకురావొచ్చని.. అంతేకాని విమర్శలు చేయడమే పనిగా పెట్టుకోవద్దని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి హితవు పలికారు.

కాగా, శేషాచలం కొండల్లోని అంజనాద్రియే ఆంజనేయుడి జన్మస్థానమని టీటీడీ పండితుల కమిటీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని గత నెల 21న శ్రీరామనవమి రోజున తిరుమలలో ఆంజనేయుడి జన్మస్థానంపై పరిశోధన చేసిన కమిటీ ప్రకటించింది. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే చెప్పాలని కమిటీ చైర్మన్‌గా వ్యవహరించిన జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ మురళీధర శర్మ కోరారు.

ఈ నేపథ్యంలో కర్ణాటకలోని హనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి స్వామి హనుమంతుడి జన్మస్థాన ప్రకటనపై తనకున్న అభ్యంతరాలతో టీటీడీకి ఓ లేఖ రాశారు. ఆంజనేయుడి జన్మస్థలంపై చర్చాగోష్టి నిర్వహించాలని కోరారు. గత నెల జాతీయ సంస్కృత వర్సిటీలో ఆంజనేయుడి జన్మస్థానం అంశంపై చర్చ జరిగిన  సంగతి విదితమే.

చదవండి: అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థానం  
హనుమ జన్మస్థలం: ఆధారాలు తప్పని నిరూపించలేకపోయారు

>
మరిన్ని వార్తలు