టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి రిలీవ్‌  

9 May, 2022 04:16 IST|Sakshi
ధర్మారెడ్డికి బాధ్యతలు అప్పగిస్తున్న జవహర్‌రెడ్డి

ఈవోగా ధర్మారెడ్డికి తాత్కాలికంగా అదనపు బాధ్యతలు

సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్న జవహర్‌రెడ్డి

ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ సమీర్‌శర్మ 

సాక్షి, అమరావతి/తిరుమల: టీటీడీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి ఆ బాధ్యతల నుంచి రిలీవ్‌ అయ్యారు. టీటీడీ ఈవోగా ప్రస్తుతానికి అదనపు బాధ్యతలను టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డికి ప్రభుత్వం అప్పగించింది. ఇకనుంచి జవహర్‌రెడ్డి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా ఎస్‌.సత్యనారాయణ, యువజన సర్వీసుల శాఖ కమిషనర్‌గా కె.శారదాదేవి నియమితులయ్యారు. యువజన సర్వీసుల శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సి.నాగరాణిని రిలీవ్‌ చేశారు. సెర్ఫ్‌ సీఈవో ఎండీ ఇంతియాజ్‌కు మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి, కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

పూర్వజన్మ సుకృతం: జవహర్‌రెడ్డి
కాగా ఈవో బాధ్యతల నుంచి రిలీవ్‌ అయిన జవహర్‌రెడ్డి ఆదివారం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో ధర్మారెడ్డికి టీటీడీ ఈవో (ఎఫ్‌ఏసీ) బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో జవహర్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీవారి కొలువులో 19 నెలలు భక్తులకు సేవలందించానని, ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పారు.

టీటీడీ పాలన కాస్త భిన్నమైనదని, ఆలయ వ్యవహారాలు, అర్చక వ్యవస్థ కొత్త అనుభూతినిచ్చాయని చెప్పారు.  శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా పేదవర్గాల వారికి స్వామివారి దర్శనం చేయించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. టీటీడీ ఈవో(ఎఫ్‌ఏసీ) ధర్మారెడ్డి టీటీడీ బోర్డు ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. జేఈవో (ఆరోగ్యం, విద్య) సదాభార్గవి ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. 

మరిన్ని వార్తలు