తిరుమల శ్రీవారి భక్తులకు మరో గుడ్‌ న్యూస్‌

29 Mar, 2022 17:51 IST|Sakshi

సాక్షి, తిరుపతి: శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. ఇకపై వయోవృద్ధులు, వికలాంగులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుండి ఈ ప్రత్యేక దర్శనాలు ప్రారంభం కానున్నాయి. భక్తుల గోవింద నామస్మరణలతో మారుమ్రోగే ఏడుకొండలు కరోనా ప్రభావంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2020 మార్చి 20 తేదీన శ్రీవారి దర్శనాలకు భక్తుల అనుమతిని తాత్కాలికంగా రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.

అటు తరువాత కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జూన్ 8,9వ తేదీల్లో టీటీడీ ఉద్యోగులకు దర్శన భాగ్యం‌ కల్పించిన తరువాత 10వ తేదీ స్థానికులతో శ్రీవారి దర్శనం ట్రయిల్ రన్‌ను టీటీడీ నిర్వహించింది. అటు తరువాత జూన్ 11వ తేదీ నుంచి 6 వేల మంది భక్తులతో శ్రీవారి దర్శనాలు ప్రారంభించింది. క్రమేపి భక్తుల సంఖ్యను 75 వేల మంది భక్తులకు పైగా దర్శనభాగ్యం కల్పిస్తోంది టీటీడీ.. ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, నిత్య సేవలైన అర్చన, తోమాల, అభిషేక సేవలను ఏకాంతంగా నిర్వహిస్తూ వచ్చింది. దర్శనాలు పునః ప్రారంభమైన ప్రత్యక్షంగా ఆర్జిత, నిత్య సేవలలో పాల్గొనే అవకాశం మాత్రం భక్తులకు దక్కలేదు. భక్తుల కోరిక మేరకు కల్యాణోత్సవ సేవను వర్చువల్ గా టీటీడీ ప్రారంభించింది. వర్చువల్ సేవకు భక్తుల వద్ద నుంచి విశేష స్పందన రావడంతో ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను వర్చువల్‌గా ప్రారంభించింది.

శ్రీవారికి వారానికి ఒక్కసారి నిర్వహించే విశేష పూజ, అష్టదళము,సహస్ర కలిశాభిషేకం,తిరుప్పావడ, నిత్యం నిర్వహించే వసంతోత్సవ సేవను ప్రారంభించలేదు. గతేడాది ఏప్రిల్ 14వ తేదీ నుంచి సేవలను ప్రారంభిస్తామని టీటీడీ ప్రకటించినా కేసులు భారీగా పెరుగుతుండటంతో అప్పట్లో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. మరల ఈ ఏడాది అర్జిత, నిత్య సేవలకు సంబంధించిన టిక్కెట్లను విడుదల చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్జిత, నిత్య సేవలలో ప్రత్యక్షంగా భక్తులు పాల్గొనే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది.

కోవిడ్ ప్రభావం పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టడంతో భక్తుల సంఖ్య పెంపుపై టీటీడీ దృష్టి సారించింది. ఈ క్రమంలో గత రెండు ఏళ్లుగా వికలాంగులు, వయో వృద్దులకు జారీ చేసే దర్శన విధానంలో నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల తరువాత వికలాంగులు, వయో వృద్దులకు స్వామి వారి దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. కోవిడ్ ముందు వరకూ తిరుమలలోని మ్యూజియం వద్ద ఉన్న కౌంటర్లో ఉదయం 10 గంటలకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు 750 టోకెన్లను వయో వృద్దులకు,వికలాంగులకు కేటాయించేది టీటీడీ.. అయితే కోవిడ్ కారణంగా ఈ టోకెన్ల జారీని నిలిపి వేసింది.

కోవిడ్ పూర్తి స్ధాయిలో తగ్గుముఖం పట్టడంతో భక్తుల సంఖ్యను పెంచింది. అయితే ప్రతి నెల మొదటి శుక్రవారం నాడు నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో వికలాంగులకు, వయోవృద్దులకు దర్శనం కల్పించాలంటూ భక్తులు టీటీడీ అధికారులను విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా టీటీడీ అధికారులకు పెద్ద ఎత్తున లేఖలు కూడా రావడంతో దీనిపై సానుకూలంగా స్పందించింది టీటీడీ.. ఈక్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి వయో వృద్దులకు, వికలాంగులకు కల్పించే దర్శనాలను పునరుద్దరిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది.

రోజుకి 1000 టిక్కెట్ల చొప్పున భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. అయితే శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ఉదయం పది గంటలకు, శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు వయో వృద్దులకు, వికలాంగులు దర్శన భాగ్యం కల్పచేందుకు టీటీడీ చర్యలు చేపడుతుంది.. అయితే వీరికి అందజేసే టోకెన్ల జారీ ప్రక్రియను తిరుమలలో జారీ చేస్తారా..లేక తిరుపతిలో‌ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తారా.. లేక ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు జారీ చేస్తారా అన్న విషయం మాత్రం తెలియాల్సింది.. ఏది ఏమైనప్పటికీ వికలాంగులు, వయోవృద్దుల విషయంలో టీటీడీ తీసుకున్న నిర్ణయంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు