పేద భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం

12 Dec, 2021 02:51 IST|Sakshi
మాట్లాడుతున్న టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి

తిరుమల: బ్రహ్మోత్సవ దర్శనం తరహాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార వర్గాలకు చెందిన శ్రీవారి భక్తులకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉచితంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన బోర్డు సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఈవో డాక్టర్‌ జవహర్‌రెడ్డి, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహ¯Œన్, బోర్డు సభ్యులు డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పాలకమండలి సభ్యులు పోకల అశోక్‌కుమార్, దేవదాయ శాఖ కమిషనర్‌ హరి జవహర్‌లాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మయ్య, సీవీఎస్వో గోపినాథ్‌ జెట్టి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఐదుగురు బోర్డు సభ్యులు వర్చువల్‌ విధానంలో హాజరయ్యారు.  

బోర్డు సమావేశంలో నిర్ణయాలు ఇవీ.. 
► వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 13 నుంచి 10 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం. 
► కరోనా నిబంధనలు సడలిస్తే కొత్త సంవత్సరంలో ఎక్కువ మంది భక్తులను సర్వదర్శనానికి అనుమతించడంతో పాటు పరిమిత సంఖ్యలో శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతించే యోచన. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాయాలని నిర్ణయం. 
► శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు శ్రీవేంకటేశ్వర తత్వాన్ని ప్రచారం చేసేందుకు శ్రీ వేంకటేశ్వర నామకోటి పుస్తకాలు అందించాలని నిర్ణయం. 
► శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చేందుకు స్థలం గుర్తింపు. వెంటనే ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని నిర్ణయం. ఇందుకోసం ఎస్వీ ప్రాణదాన ట్రస్టు ద్వారా విరాళాలు అందించే దాతలకు ఉదయాస్తమాన సేవా టికెట్లు కేటాయింపు. 
► తిరుమలలో హనుమంతుడి జన్మస్థలమైన అంజనాదేవి ఆలయ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయం. నాద నీరాజనం వేదికను  సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు మండపం నిర్మాణం. ఈ రెండింటిని దాతల విరాళాలతో చేపడతారు. 
► ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న శ్రీవారి మెట్టు మార్గంలో రూ.3.6 కోట్లతో, రెండో ఘాట్‌ రోడ్డులో రూ.3.95 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ఆమోదం. 
► కల్యాణకట్ట క్షురకులకు పీస్‌రేట్‌ రూ.11 నుంచి రూ.15కు పెంచేందుకు ఆమోదం. 
► కార్తీక దీపోత్సవం, శ్రీనివాస కల్యాణం లాంటి ధార్మిక కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రముఖ నగరాల్లో నిర్వహించాలని నిర్ణయం. 
► వైఎస్సార్‌ జిల్లా రాజంపేట సమీపంలోని అన్నమయ్య డ్యామ్‌ పరీవాహక ప్రాంతంలో ధ్వంసమైన 7 ఆలయాల పునర్నిర్మాణం. 
► టీటీడీలో పరిపాలనా పరమైన నూతన అప్లికేషన్లలో ఇబ్బందులు తలెత్తకుండా ఐటీ విభాగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయం. 
► శ్రీశైలం దేవస్థానం శివాజీ గోపురానికి శ్రీవారి నిధులతో రాగి కలశాలపై బంగారు తాపడం చేసేందుకు ఆమోదం. 

తిరుమలకు మూడో ఘాట్‌ రోడ్‌
తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలకు మరో ఘాట్‌ రోడ్డును నిర్మించనున్నట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో శనివారం జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గతంలోనే అన్నమయ్య నడక మార్గాన్ని అభివృద్ధి చేయాలని భావించారని, ఇప్పుడు పాలక మండలి ఈ ప్రతిపాదనను ఆమోదించిందని చెప్పారు. టీటీడీ ఇంజనీర్లు దీనిపై పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి మెరుగైన డిజైన్లు రూపొందిస్తారని, త్వరలోనే దీనికి శ్రీకారం చుడతామని వెల్లడించారు. 

చదవండి: (నీలి బెండపూడికి సీఎం జగన్‌ అభినందనలు)


అన్నమయ్య మార్గం ఇలా..
పదకవితా పితామహుడు అన్నమాచార్యులు ఈమార్గం మీదుగానే తిరుమలకు చేరుకునే వారు. ఇది శేషాచలం అటవీప్రాంతం మీదుగా సాగుతుంది. ఈదారి ద్వారా తిరుపతికి వెళ్లకుండా నేరుగా తిరుమలకు చేరుకోవచ్చు. రేణిగుంట మండలం కరకంబాడి–బాలపల్లి మధ్యన రైల్వే మార్గానికి పశ్చిమ భాగంలో ఈ మార్గం ప్రారంభమవుతుంది. ఇప్పటికీ పలువురు కడప జిల్లా వాసులు ఈ మార్గం ద్వారానే స్వామివారి సన్నిధికి వెళుతుంటారు. సాళువ నరసింహరాయలు అనంతరం విజయనగర ప్రభువుల కాలంలో ఈ మార్గాన్ని వినియోగించుకునేవారు. 

స్వాతంత్రానికి పూర్వమే మొదటి ఘాట్‌ రోడ్డు..
తిరుపతి నుంచి తిరుమలకు మొదటి ఘాట్‌ రోడ్‌ను స్వాతంత్రానికి పూర్వమే 1944లో విఖ్యాత ఇంజనీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పర్యవేక్షణలో నిర్మించారు. అనంతరం 1970ల్లో రెండో ఘాట్‌రోడ్డు నిర్మాణం జరిగింది.  

మరిన్ని వార్తలు