శ్రీరామనవమి రోజున ఆధారాలు బయటపెడతాం

14 Apr, 2021 03:00 IST|Sakshi

తిరుమల: శ్రీరాముని జన్మభూమి అయిన అయోధ్యలో దేవాలయం నిర్మితమవుతున్న తరుణంలో హనుమంతుడి జన్మస్థలాన్ని కూడా నిర్ధారించాల్సిన అవసరం ఉందని టీటీడీ ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి అన్నారు. మంగళవారం శ్రీవారి ఆలయంలో నూతన ప్లవనామ సంవత్సర ఉగాది ఆస్థానంలో పాల్గొన్న జవహర్‌రెడ్డి అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ఏ రాష్ట్రం హనుమంతుడి జన్మస్థలం తమ ప్రాంతమేనని చెప్పలేదన్నారు. హనుమంతుడి జన్మస్థలంపై క్షేత్రస్థాయిలో చర్చ జరగాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

టీటీడీ పండితుల వద్ద బలమైన ఆధారాలు
కర్ణాటకలోని హంపి ప్రాంతం హనుమంతుడి జన్మస్థలంగా చెబుతున్నారని జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే టీటీడీ పండితుల వద్ద ఉన్న ఆధారాలను శ్రీరామనవమి రోజున బయట పెడతామని తెలిపారు. ఇతర రాష్ట్రాలవారు కూడా తమ వద్ద ఉన్న ఆధారాలను బయట పెట్టవచ్చన్నారు. ఇప్పటికే టీటీడీ నియమించిన పండితుల కమిటీ తిరుమలలోని అంజనాద్రి పర్వతమే హనుమంతుడి జన్మస్థలమని పురాణాలను పరిశీలించి బలమైన ఆధారాలను సేకరించిందని వివరించారు.

పురాణేతిహాసాలతో పాటు చారిత్రక ఆధారాలు సైతం వెలుగులోకి వచ్చాయని చెప్పారు. హనుమంతుడి జన్మస్థలంపై పండితులు సేకరించిన ఆధారాలతో తయారు చేసిన నివేదికను శ్రీరామనవమి రోజున ప్రజల ముందుకు తీసుకువచ్చి అందరి అభిప్రాయాలను తీసుకుంటామని జవహర్‌రెడ్డి వివరించారు. ప్లవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని  పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం 7 గంటల నుంచి ఉగాది ఆస్థానాన్ని ఆగమోక్తంగా నిర్వహించామని చెప్పారు.  

మరిన్ని వార్తలు