TTD: ఆపత్కాలంలో టీటీడీ ఔదార్యం

24 May, 2021 04:35 IST|Sakshi

రాష్ట్ర వ్యాప్తంగా జర్మన్‌ షెడ్ల నిర్మాణం

రూ.3.52 కోట్ల కేటాయింపు

అందుబాటులో మరో వెయ్యి ఆక్సిజన్‌ బెడ్లు 

జిల్లా వ్యాప్తంగా పలు క్వారన్‌టైన్‌ సెంటర్ల ఏర్పాటు

ఆపత్కాలంలో బాధితులను అండగా ఆధ్యాత్మిక క్షేత్రం

తిరుమల: కోవిడ్‌ బాధితులకు టీటీడీ అండగా నిలుస్తోంది. ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా అడుగులు వస్తోంది. కరోనా కోరల్లో చిక్కి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటున్నా, ఆదాయ మార్గాలు సన్నగిల్లుతున్నా ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతనిస్తూ.. కరోనా బాధితుల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా రూ.3.52 కోట్లతో 22 ప్రాంతాల్లో జర్మన్‌ షెడ్లు ఏర్పాటు చేసింది. వీటి ఏర్పాటుతో అదనంగా మరో వెయ్యి ఆక్సిజన్‌ బెడ్లు బాధితులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 

బాధితుల కోసం క్వారన్‌టైన్‌ సెంటర్లు
కరోనా ప్రారంభం నుంచి పెద్ద సంఖ్యలో బాధితులు టీటీడీ ఏర్పాటు చేసిన కోవిడ్‌ కేంద్రాల్లో వైద్యం పొందారు. చిత్తూరు జిల్లా వాసులే కాకుండా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లా నుంచి కోవిడ్‌ భాధితులు తిరుపతిలో చికిత్స పొందారు. ఈ ఏడాది కూడా స్విమ్స్‌తో పాటు పద్మావతి నిలయం, విష్ణు నివాసం, శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాలు కోవిడ్‌ బాధితుల కోసం కేటాయించారు. ఆయుర్వేద వైద్యశాలలో ప్రత్యేకంగా ఆక్సిజన్‌ బెడ్లు ఏర్పాటు చేశారు. టీటీడీ ఉద్యోగుల కోసం ఆగమేఘాలమీద బర్డ్‌ హాస్పిటల్‌ను కోవిడ్‌ హస్పిటల్స్‌  మార్పు చేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది. 
కరోనా బాధితులకు టీటీడీ ఏర్పాటు చేసిన జర్మన్‌ షెడ్డు 

ఆపన్నులకు అభయ హస్తం
అంతర్రాష్ట్ర సరహద్దు ప్రాంతం కావడం, శ్రీవారి దర్శనానికి నిత్యం ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో జిల్లాలో పెద్ద ఎత్తున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బాధితులకు చికిత్స అందించేందుకు జిల్లా యంత్రాంగం టీటీడీపైనే ఆధారపడింది. ఆర్థికపరమైన సహాయంతో పాటు హాస్పిటళ్లు, క్వారంటైన్‌ సెంటర్లు టీటీడీ సమకూర్చింది. గతేడాది ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అప్పటికప్పుడు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో తిరుపతి పరిసర ప్రాంతాల్లో నిత్యం 1.2 లక్షల మందికి ఆహార పొట్లాలు పంపిణీ చేసింది.ఎమ్మెల్యేలు కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి, బియ్యపు మధుసూదన్‌ రెడ్డి సహకారంతో ఆపన్నుల ఆకలి తీర్చింది. 

ఆపత్కాలంలో ఆర్థిక భరోసా
కోవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు టీటీడీ గత ఏడాది రూ.19 కోట్లు కేటాయించింది. రాయలసీమ వాసులకు ఇదే ప్రాణధారగా మారింది. ప్రస్తుతం రూ.3.52 కోట్లు కేటాయించింది. ఆయా నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా జర్మన్‌ షెడ్లు ఏర్పాటు చేసింది. సాధారణంగా టీటీడీ హుండీ ఆదాయం రోజుకు రూ.3 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల వరకు వస్తుంది. నెలకు రూ.90 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు వచ్చేది. కరోనా కారణంగా గత ఏడాది నుంచి భక్తుల సంఖ్య తగ్గుతోంది. ఫలితంగా ఆదాయం గణనీయంగా పడిపోతోంది. ప్రస్తుతం రోజుకు రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలు, ఒక్కో రోజు రూ.70 లక్షల వరకు వస్తోంది. ఆదాయం తగ్గుతున్నా ప్రజల సేవకు మాత్రం వెనుకడుగు వేయడంలేదు. కరోనా కాలంలో ఆధ్యాత్మిక క్షేత్రం ఇటు ప్రభుత్వానికి, అటు ప్రజలకు అండగా నిలుస్తోంది. 

బాధితుల కోసం జర్మన్‌ షెడ్లు
బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో స్విమ్స్‌లో బెడ్లు కొరత ఏర్పడింది. బాధితులు ఆరుబయటే ఉంటూ ఆక్సిజన్‌ పొందాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో టీటీడీ జర్మన్‌ షెడ్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చొరవతో 30 ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదే విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తోంది. ఇందుకోసం టీటీడీ రూ.3.52 కోట్లను శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయోనిధి నుంచి మంజూరు చేసింది. విశాఖపట్నం జిల్లాలో 4, ప్రకాశంలో 2, అనంతపురంలో 3, కర్నూల్‌లో 2, గుంటూరులో 3, కాకినాడలో 3 జర్మన్‌ షెడ్లతోపాటు ఇతర ప్రాంతాల్లో మరో రెండు షెడ్లు ఏర్పాటు చేయనుంది. ఒక్కో షెడ్డులో 30 నుంచి 50 ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరో వెయ్యి ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. 

కోవిడ్‌ బాధితులకు మెరుగైన సేవలు
ఆపత్కాలంలో టీటీడీ ప్రజలకు అండగా నిలుస్తోంది. కోవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు సంకల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 ప్రాంతాల్లో రూ.3.52 కోట్లతో జర్మన్‌ షెడ్లు ఏర్పాటు చేసింది. ప్రతి చోటా 50 వరకు ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులోకి తెచ్చింది.  
– వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ చైర్మన్‌

ప్రభుత్వ ప్రోత్సాహంతోనే..
రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ప్రజాసేవకు టీటీడీ కూడా భాగస్వామ్యమవుతోంది. గతేడాది పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేశాం. ఇప్పటికే టీటీడీ వసతి గృహాలు కోవిడ్‌ బాధితులకు అందుబాటులోకి తీసుకొచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా జర్మన్‌ షెడ్లు ఏర్పాటు చేశాం.  
– ఏవీ ధర్మారెడ్డి, అడిషనల్‌ ఈఓ 

ఉద్యోగులకు అత్యాధునిక వైద్యం
దేశంలోనే ఎక్కడా లేని విధంగా టీటీడీ ఉద్యోగులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. 7 వేల రెగ్యులర్‌ ఉద్యోగులు, 15వేల మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఉండగా ఇప్పటికే 40% మందికి మొదటి దశ వ్యాక్సినేషన్‌ పూర్తి చేసింది. మరో 20% మందికి సెకండ్‌ డోస్‌ కూడా పూర్తి చేసింది. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం మాధవం, ఆయుర్వేద, బర్డ్‌ ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలందిస్తోంది. రూ.5 లక్షల మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ నుంచి టీటీడీ ఉద్యోగులకు కేటాయించింది.
– కీర్ల కిరణ్, టీటీడీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు