టీటీడీ మొబైల్‌ యాప్‌ ప్రారంభం

28 Jan, 2023 08:25 IST|Sakshi
మొబైల్‌ యాప్‌ను ప్రారంభిస్తున్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి

తిరుమల: భక్తులకు మరింత మెరుగైన డిజిటల్‌ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా ‘టీటీ దేవస్థానమ్స్‌’ పేరుతో రూపొందించిన మొబైల్‌ యాప్‌ను టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. తిరుమల అన్నమయ్య భవనంలో చైర్మన్‌ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ భక్తుల కోసం ఇప్పటివరకు గోవింద మొబైల్‌ యాప్‌ ఉండేదని, దీన్ని మరింత ఆధునీకరించి మరిన్ని అప్లికేషన్లు పొందుపరచి నూతన యాప్‌ను రూపొందించామని తెలిపారు. ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుక్‌ చేసుకోవచ్చన్నారు.

విరాళాలు కూడా ఇదే యాప్‌ నుంచి అందించవచ్చని చెప్పారు. ఎస్వీబీసీ ప్రసారాలను లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా ఈ యాప్‌ ద్వారా చూడవచ్చని తెలిపారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం ఈ యాప్‌ను రూపొందించినట్టు వివరించారు. సామాన్య భక్తులకు స్వామివారి సేవలు, దర్శనం, టికెట్లు, వసతి సులువుగా అందించేందుకు ఆన్‌లైన్‌ ద్వారా క్లౌడ్‌ టెక్నాల­జీని ఉపయోగిస్తున్నామని తెలిపారు. నూత­న యాప్‌ సేవలపై భక్తుల నుంచి సలహాలు, సూ­చనలు స్వీకరించి అవసరమైతే మరిన్ని  పొందుపరుస్తామని చెప్పారు. టీటీడీ ఈవో ఏవీ ధ­ర్మారెడ్డి మాట్లాడుతూ భక్తులు లాగిన్‌ అ­య్యేందుకు యూజర్‌ నేమ్‌తోపాటు ఓటీపీ ఎంటర్‌ చేస్తే చాలని, పాస్‌వర్డ్‌ అవసరం లేదని చె­ప్పా­రు.  తిరుమల శ్రీవారి ఆల­య బం­గారు తాప­డం పనులను ఐదు నుంచి ఆరు నె­లలు వా­యి­దా వేస్తున్నామని, త్వరలో మరో తేదీ నిర్ణయిస్తామని వెల్లడించారు. టీటీడీ జేఈ­వో వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహకిషోర్, జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌ ప్రెసిడెంట్, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అనీష్‌ షా, ఐటీ సలహాదారు అమర్, ఐటీ జీఎం సందీప్‌ పాల్గొన్నారు.

చదవండి: వైద్యచరిత్రలో మరో మైలురాయి.. మారేడుమిల్లి ఘటనతో చలించిపోయి..

మరిన్ని వార్తలు