బ్రహ్మోత్సవాల సమయంలో ‘ప్రత్యేక’ దర్శనాలు రద్దు 

29 Jul, 2022 04:41 IST|Sakshi
మాట్లాడుతున్న ధర్మారెడ్డి

సర్వదర్శనానికి మాత్రమే అనుమతి 

తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో సామాన్య భక్తులకు టీటీడీ పెద్దపీట వేయనుంది. అన్ని రకాల ప్రివిలేజ్డ్‌ దర్శనాలను రద్దు చేసింది. భక్తులకు సర్వదర్శనం మాత్రమే కల్పించనుంది. రూ.300 దర్శన టికెట్లతోపాటు శ్రీవాణి ట్రస్టు దాతలకు, ఇతర ట్రస్టుల దాతలకు దర్శన టికెట్లు, వీఐపీ బ్రేక్, వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం, తదితర దర్శనాలను రద్దు చేసింది. ఆర్జిత సేవలు కూడా రద్దు చేసినట్లు పేర్కొంది. స్వయంగా వచ్చే ప్రొటోకాల్‌ వీఐపీలకు మాత్రమే శ్రీవారి బ్రేక్‌ దర్శనం ఉంటుందని వెల్లడించింది.

తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం జిల్లా కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, ఇతర టీటీడీ అధికారులతో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ..బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన సెప్టెంబర్‌ 27న సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. తొలిరోజు ధ్వజారోహణం కారణంగా రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహన సేవ ప్రారంభమవుతుందని, మిగతా రోజుల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తామన్నారు.

పెరటాసి మాసం మూడో శనివారం నాడు గరుడ సేవ రావడంతో తమిళనాడు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముందని, రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. భక్తులకు సేవలందించేందుకు 3,500 మంది శ్రీవారి సేవకులను ఆహ్వానిస్తామన్నారు. గరుడసేవ నాడు పూర్తిగా, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుమల–తిరుపతి ఘాట్‌ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించనున్నట్లు వెల్లడించారు.   

మరిన్ని వార్తలు