మూడేళ్లల్లో రూ.1,100 కోట్లకుపైగా విరాళాలు

23 Jun, 2022 08:48 IST|Sakshi

రూ.600 కోట్లతో కొనసాగుతున్న వివిధ కార్యక్రమాలు

టీటీడీ చొరవతో ముందుకొస్తున్న దాతలు

తిరుమల: వడ్డికాసులవాడిపై భక్తులు కాసుల వర్షం కురిపిస్తున్నారు. లక్షల మంది భక్తులు మొక్కులు తీర్చుకుంటూ స్వామి హుండీలో కోట్ల రూపాయలు సమర్పించుకుంటున్నారు. వివిధ కార్యక్రమాలు, పథకాల అమలుకు వందల కోట్ల విరాళమిస్తూ శ్రీవారిపై తమ భక్తిని చాటుకుంటున్నారు. కోవిడ్‌ సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం తగ్గినా.. విరాళాల సేకరణలో టీటీడీ సఫలీకృతమైంది. గత మూడు సంవత్సరాల్లో టీటీడీ నిర్వహిస్తున్న వివిధ పథకాలకు విరాళాల రూపంలో రూ.1,100 కోట్లకుపైగా నిధులు సమకూరాయి. 

మరో రూ.600 కోట్ల విరాళాలతో వివిధ కార్యక్రమాలను టీటీడీ నిర్వహిస్తోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు. స్వామి దర్శనార్థం ఏడాదికి రెండున్నర కోట్లమంది భక్తులు తరలివస్తుంటే.. రూ.3 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. తమ కోర్కెలు తీర్చిన స్వామికి మొక్కుల చెల్లింపులో భాగంగా హుండీలో సమర్పించే నగదు ఏడాదికి రూ.వెయ్యి కోట్లు దాటుతోంది. ఇక బంగారం అయితే టన్నుకు పైనే. టీటీడీ నిర్వహిస్తున్న పథకాలకు భక్తులు అందించే విరాళాలు రూ.300 కోట్లకు పైగానే ఉంటున్నాయి. టీటీడీ చేపట్టే కార్యక్రమాలకు దాతలు అందించే సహకారం కూడా వందల కోట్లు దాటేస్తోంది. రెండేళ్లుగా కోవిడ్‌తో శ్రీవారి హుండీ ఆదాయం ఆశించినంత రాకపోయినా.. దాతల సహకారం మాత్రం గొప్పగానే ఉంది. 

టీటీడీ కార్యక్రమాలకు విరాళాలు ఇలా..
టీటీడీ నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలకు దాతలే మొత్తం నిధులు వెచ్చిస్తున్నారు. రూ.120 కోట్ల వ్యయంతో మ్యూజియం అభివృద్ధి పనులను టీటీడీ ప్రారంభించింది. శ్రీవారి ఆభరణాలను భక్తులు ప్రత్యక్షంగా తిలకించిన అనుభూతి కలిగేలా త్రీడీ విధానంలో ప్రదర్శన ఏర్పాటు చేయడంతో పాటు.. శ్రీవారి ఆలయం సందర్శించిన అనుభూతి కల్పించేలా మ్యూజియంను తీర్చిదిద్దుతున్నారు. ఈ మొత్తం వ్యయాన్ని టాటా, టెక్‌ మహింద్రా సంస్థలు భరిస్తున్నాయి. 

రూ.25 కోట్లతో అలిపిరి నడకమార్గంలో భక్తుల సౌకర్యార్థం పైకప్పు నిర్మాణాన్ని రిలయన్స్‌ సంస్థ చేపట్టింది.
టీటీడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మాణానికి ఇప్పటివరకు రూ.180 కోట్లు విరాళాలుగా సమకూరాయి. శ్రీవారి ఆలయంలో ఉదయాస్తమాన సేవా టికెట్లకు భక్తులు విరాళంగా అందించిన నిధులును టీటీడీ ఈ ఆస్పత్రి నిర్మాణానికి కేటాయిస్తోంది.

హనుమంతుడి జన్మస్థలం అభివృద్ధి పనులకు వెచ్చిస్తున్న రూ.60 కోట్లను టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు విరాళంగా అందించారు.

శ్రీవారి ఆలయం వెలుపల రూ.18 కోట్లతో నిర్మిస్తున్న అధునాతన పరకామణి మండపానికి బెంగళూరుకు చెందిన మురళీకృష్ణ విరాళం అందించారు.

ముంబైలో రూ.70 కోట్లతో నిర్మించే శ్రీవారి ఆలయానికి సంబంధించి పూర్తి వ్యయాన్ని భరించేందుకు రేమాండ్స్‌ సంస్థ ముందుకొచ్చింది.

తిరుమలలో ఉద్యానవనాల అభివృద్ధికి దాతలు రూ.5 కోట్లు విరాళంగా అందించారు. 
టీటీడీ అభివృద్ధి పరుస్తున్న గోశాలలకు దాతలు రూ.20 కోట్లు ఇచ్చారు.
టీటీడీ చానల్‌ ఎస్వీబీసీకి రూ.46 కోట్ల వ్యయంతో దాతలు వివిధ పరికరాలను విరాళంగా సమకూర్చారు. 
బర్డ్‌ ఆస్పత్రికి రూ.10 కోట్లతో దాతలు అధునాతన పరికరాలను సమకూర్చారు.

మరిన్ని వార్తలు