TTD: నాలుగున్నర గంటల్లోనే 7.08 లక్షల టికెట్లు ఖాళీ 

23 Oct, 2021 08:17 IST|Sakshi

తిరుమల:  శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నవంబర్, డిసెంబర్‌ నెలల టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో శుక్రవారం ఉదయం 9 గంటలకు విడుదల చేసింది. గత నెలలో రోజుకు 8 వేల ఎస్‌ఈడీ టికెట్లు జారీ చేయగా ప్రస్తుతం రోజుకు 12 వేల చొప్పున రెండు నెలలకు 7 లక్షల 8 వేల టికెట్లను విడుదల చేయగా మధ్యాహ్నం 1:30 గంటలకల్లా భక్తులు వీటిని కొనుగోలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు భారీగా శ్రీవారి ఎస్‌ఈడీ టికెట్ల కోసం ఆన్‌లైన్‌లో ప్రయత్నించడంతో రికార్డు సమయంలో టికెట్లన్నీ ఖాళీ అయ్యాయి. పరిమిత సంఖ్యలోనే టికెట్లు జారీ చేస్తుండడంతో చాలా మంది భక్తులకు టికెట్లు లభించలేదు.

టీటీడీ ఐటీ విభాగం, టీసీఎల్, జియో సంస్థ క్లౌడ్‌ మేనేజ్‌మెంట్‌ విధానం సాయంతో భక్తులు సులభంగా ఆన్‌లైన్‌లో టికెట్లను పొందారు. వెబ్‌సైట్‌లోకి ప్రవేశించేందుకు వర్చువల్‌ క్యూ ద్వారా ముందుగా వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యేందుకు సమయాన్ని కేటాయించారు. అనంతరం భక్తులు వర్చువల్‌ క్యూ పద్ధతి ద్వారా వెబ్‌సైట్‌లోకి ప్రవేశించి టికెట్లను బుక్‌ చేసుకున్నారు. దీంతో సర్వర్ల క్రాష్‌ సమస్య లేకుండా భక్తులు టికెట్లను పొందగలిగారు.  

టీటీడీకి రూ.21 కోట్ల ఆదాయం 
ఒకానొక దశలో దర్శన టికెట్ల కోసం ఒక్కసారిగా వెబ్‌సైట్‌లో ఏడు లక్షల హిట్లు వచ్చాయి. కేవలం మొదటి 24 నిమిషాల్లోనే రెండు లక్షల టికెట్లను భక్తులు కొనుగోలు చేశారు. 45 నిమిషాల వ్యవధిలో 3.35 లక్షల టికెట్లు, గంటలో 4 లక్షల 20 వేల టికెట్లు భక్తులు కొనుగోలు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు 6 లక్షల 50 వేల టికెట్లు, 1.30 గంటలకు నవంబర్, డిసెంబర్‌కు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లన్నీ ఖాళీ అయ్యాయి.

టికెట్ల విక్రయం ద్వారా టీటీడీకి దాదాపు రూ.21 కోట్ల ఆదాయం లభించింది. భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చే సమయంలో టీకా ఒక డోసు, రెండు డోసుల సర్టిఫికెట్, 12 గంటల ముందు కోవిడ్‌ పరీక్ష చేయించుకుని నెగిటివ్‌ రిపోర్టుతో గానీ శ్రీవారి దర్శనానికి రావచ్చు. శనివారం ఉదయం 9 గంటలకు నవంబర్‌కు సంబంధించిన శ్రీవారి సర్వదర్శనం టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.  
 

మరిన్ని వార్తలు