ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రే

22 Apr, 2021 03:02 IST|Sakshi
ఆధారాల నివేదికను ఆవిష్కరిస్తున్న తమిళనాడు గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్, టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, మురళీధర్‌శర్మ, కమిటీ సభ్యులు

శాస్త్రబద్ధంగా ఆధారాలతో నిరూపించిన టీటీడీ 

తిరుమల గిరుల్లోని జాపాలి తీర్థం.. పవనసుతుడు పుట్టిన స్థలం

సుందరకాండ, పురాణాలు, శ్రీవేంకటేశ్వర మహాత్మ్యంలో పలు ఆధారాలు 

తిరుమలకు, వాయునందనుడికి అవినాభావ సంబంధం  

సాక్షి, తిరుపతి, తిరుమల: కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువుదీరిన ఏడుకొండలే రామభక్తుడైన ఆంజనేయుడి జన్మస్థలం అని టీటీడీ ఆధారాలతో సహా నిరూపించింది. తిరుమలలో శ్రీవారి ఆలయానికి సమీపంలోని జాపాలి తీర్థమే హనుమంతుడి జన్మస్థలమని.. అదే అంజనాద్రి అని తెలిపింది. ఈ మహత్తర, పురాణ, చారిత్రక ఆవిష్కరణను బుధవారం శ్రీరామనవమి రోజు టీటీడీ ప్రకటించటం విశేషం. 15వ శతాబ్దంలో విజయ రాఘవరాయలు జాపాలిలో నిర్మించిన శ్రీఆంజనేయుని ఆలయమే హనుమ జన్మస్థలం అని ఆధారాలతో టీటీడీ వెలుగులోకి తెచ్చింది. జాపాలి మహర్షి జపం ఆచరించి శ్రీనివాసుడిని ప్రసన్నం చేసుకోవడంతో ఈ తీర్థానికి జాపాలి అనే పేరు వచ్చింది.

శాస్త్రబద్ధంగా నిరూపణ: తమిళనాడు గవర్నర్‌ పురోహిత్‌
భక్త హనుమ జన్మస్థలాన్ని నిర్ధారిస్తూ పండితుల కమిటీ రూపొందించిన నివేదికను నవమి రోజు తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌ హాజరయ్యారు. హనుమ జన్మస్థలాన్ని టీటీడీ శాస్త్రబద్ధంగా నిరూపించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. క్షుణ్నంగా పరిశీలించి ఆధారాలు సేకరించడం ఎంత కష్టమో తమిళనాడులోని 20 విశ్వవిద్యాలయాల చాన్సలర్‌గా తనకు బాగా తెలుసన్నారు. నాలుగు నెలలపాటు అవిశ్రాంతంగా శ్రమించిన పండితుల కమిటీని ఆయన అభినందించారు. 

త్వరలో పుస్తక రూపంలో నివేదిక: ఈవో జవహర్‌రెడ్డి
భగవత్‌ సంకల్పంతోనే శ్రీరామనవమి నాడు హనుమంతుడి జన్మస్థానాన్ని తిరుమలగా నిరూపించామని టీటీడీ ఈవో డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి చెప్పారు. పండితులతో కూడిన కమిటీ పౌరాణిక, వాజ్ఞయ, శాసన, భౌగోళిక ఆధారాలను సేకరించి ఈ విషయాన్ని నిర్ధారించిందన్నారు. ఆధారాలతో కూడిన నివేదికను టీటీడీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, త్వరలో పుస్తక రూపంలోకి తెస్తామని ప్రకటించారు. కర్ణాటకలోని హంపి క్షేత్రాన్ని కూడా హనుమంతుడి జన్మస్థలంగా చెబుతున్నారని, దీన్ని శాస్త్రీయంగా పరిశీలించామని, అక్కడ కిష్కింద అనే రాజ్యం ఉండవచ్చని, హనుమంతుడు అంజనాద్రి నుంచి అక్కడికి వెళ్లి సుగ్రీవుడికి సాయం చేసినట్లుగా భావించవచ్చన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, హరియాణాలో హనుమంతుడు జన్మించినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. 

కమిటీ సభ్యులకు అభినందనలు..
కమిటీ సభ్యులైన ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శనశర్మ, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మురళీధరశర్మ, ఆచార్య రాణి సదాశివమూర్తి, ఆచార్య జానమద్ది రామకృష్ణ, ఆచార్య శంకరనారాయణ, ఇస్రో శాస్త్రవేత్త  రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావస్తుశాఖ మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ విజయ్‌కుమార్, టీటీడీ ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్‌ ఆకెళ్ల విభీషణశర్మలను ఈవో అభినందించారు. పండితుల కమిటీ నాలుగు నెలల పాటు విస్తృతంగా పరిశోధించి బలమైన ఆధారాలు సేకరించిందని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. 

ఇవీ ఆధారాలు..
శ్రీమద్రామాయణంలోని సుందరకాండ, అనేక పురాణాలు, వేంకటాచల మహాత్యం, ఎన్నో కావ్యాల్లో హనుమంతుని జన్మవృత్తాంతం గురించి వర్ణించి ఉందని ఆచార్య మురళీధరశర్మ చెప్పారు. కంబ రామాయణం, వేదాంత దేశికులు, తాళ్లపాక అన్నమాచార్యులు తమ రచనల్లో వేంకటాద్రిగా, అంజనాద్రిగా అభివర్ణించారని తెలిపారు. బ్రిటీష్‌ అధికారి స్టాటన్‌ క్రీ.శ.1800లో తిరుమల ఆలయం గురించి సంకలనం చేసిన అంశాలతో సవాల్‌–ఏ–జవాబ్‌ పుస్తకాన్ని రాశారని, అందులో అంజనాద్రి అనే పదాన్ని వివరిస్తూ అంజనాదేవికి ఆంజనేయుడు పుట్టినచోటు కావడం వల్లే అంజనాద్రి అనే పేరు వచ్చిందని ప్రస్తావించారని తెలిపారు. బాలాంజనేయుడు సూర్యదేవుడిని పట్టుకోవడానికి వేంకటాద్రి నుంచి లంఘించడం, శ్రీరాముని దర్శనానంతరం సీతాన్వేషణలో తిరిగి వేంకటగిరికి రావడం, అక్కడ అంజనాదేవిని మళ్లీ చూడడం, వానరవీరులు వైకుంఠగుహలో ప్రవేశించడం.. లాంటి అనేక విషయాలు వేంకటాచల మహాత్యం ద్వారా తెలుస్తున్నాయన్నారు. ఈ గ్రంథం ప్రమాణమే అని చెప్పడానికి రెండు శిలాశాసనాలు తిరుమల గుడిలో ఉన్నాయన్నారు. మొదటి శాసనం 1491 జూన్‌ 27వ తేదీ నాటిది కాగా రెండో శాసనం 1545 మార్చి 6వ తేదీకి చెందినదని వివరించారు. శ్రీరంగంలో ఉన్న ఒక శిలాశాసనం కూడా దీన్ని తెలియజేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్‌జెట్టి, ఎస్వీబీసీ సీఈవో సురేష్‌కుమార్, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య దక్షిణామూర్తి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్‌ ఆకెళ్ల విభీషణశర్మ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు