టీటీడీ పాలకమండలి భేటీ: కీలక నిర్ణయాలు

28 Nov, 2020 16:56 IST|Sakshi

త్వరలో 150 ఎలక్ట్రిక్‌ బస్సుల కొనుగోలు

సూర్యప్రభ వాహనానికి 11.76 లక్షల బంగారు తాపడం

10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచాలని నిర్ణయం

సాక్షి, తిరుమల: డిసెంబరు 27 నుంచి పది రోజుల‌పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచాలని నిర్ణయించామని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శనివారం పాలక మండలి సమావేశం నిర్వహించారు. టీటీడీ ఆస్తులపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారం పది రోజుల‌ పాటు తెరిచే ఉంచాలని భక్తులు కోరారని, ప్రత్యేక కమిటి ఏర్పాటు చేసి దేశంలో‌ని ప్రధాన పీఠాధిపతులతో చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పది రోజుల‌పాటు భక్తులకు స్వామి దర్శనం‌ కల్పిస్తామని ఆయన వెల్లడించారు. (చదవండి: శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం)

‘‘భక్తులు విరాళంగా ఇచ్చిన‌ ఆస్తులను అమ్మడానికి వీలు‌ లేకుండా శ్వేత పత్రం విడుదల చేశాం. తిరుమలలోని‌ ధ్వజస్తంభం, బలిపీఠం, మహాద్వారానికి బంగారు తాపడంపై చర్చించి‌ నిర్ణయం‌ తీసుకున్నాం. ప్రైవేట్ సెక్యూరిటీ వారికి యూనిఫాం అలవెన్స్ గా రెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. కాలు నడక భక్తుల‌ కోసం షెల్టర్ కూడా ఆధునీకరణ‌ పనులు చేపడుతున్నాం. గాలి గోపురాల మరమ్మత్తులకు నిధుల కేటాయించాం. తిరుమలలో పర్యావరణాన్ని కాపాడటంలో ప్లాస్టిక్‌ను నియంత్రించాం. తిరుమలను గ్రీన్‌సిటీగా తీర్చిదిద్దుతాం. తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులు 100 నుండి 150 బస్సులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. తిరుమలలో గ్రీన్‌పవర్ వాడేందుకు పాలక మండలి సభ్యులు తీర్మానించారు. (చదవండి: భవానీ భక్తులపై కోవిడ్ ఎఫెక్ట్)

తిరుచానూరు అమ్మవారి ఆలయంలో సూర్యప్రభ వాహనానికి 11.76 లక్షల బంగారు తాపడం కోసం ‌నిధులు కేటాయించాం. సాధారణ భక్తులకు కేటాయించే కాటేజీల ఆధునీకరణకు నిర్ణయం తీసుకున్నాం. ధర్మ రథాలు ధర్మ ప్రచార పరిషత్  కోసం తిరిగి ప్రారంభిస్తాం. టీటీడీ ఆధ్వర్యంలో పేదల  వివాహం కోసం కల్యాణ మండపాల్లో కల్యాణమస్తు కార్యక్రమం పున:ప్రారంభిస్తాం. బాల‌ మందిరాల్లో అనాధ పిల్లల సౌకర్యార్థం పది కోట్ల రూపాయలు నిధులు కేటాయించాం. చెన్నై వలందురు‌ పేటలో నాలుగు ఎకరాల్లో రూ.10 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయం నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నాం. జాతీయ‌ ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లోనే టీటీడీ డిపాజిట్లు చేయాల‌ని నిర్ణయం తీసుకున్నామని’’ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.


Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా