ఆనందయ్య మందుపై టీటీడీ పరిశోధనలు

24 May, 2021 03:59 IST|Sakshi
టీటీడీ ఆయుర్వేద ఫార్మసీలోని వన మూలికలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి తదితరులు

ఆమోదం లభిస్తే మందు తయారీలో భాగస్వామ్యం 

టీటీడీ బోర్డు సభ్యుడు చెవిరెడ్డి నేతృత్వంలో నిపుణుల భేటీ 

ఆనందయ్య మందు వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేవని నిర్ధారణ 

డ్రాప్స్‌ వల్ల కంటికి ఎటువంటి హాని కలగదు  

ఆయుర్వేద అంజన ప్రక్రియ విధానం అదే చెబుతోంది

చంద్రగిరి: కరోనా నియంత్రణలో ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందుపై టీటీడీ ఆయుర్వేద నిపుణుల ఆధ్వర్యంలో పరిశోధనలు ప్రారంభమయ్యాయి. టీటీడీ పాలక మండలి సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నేతృత్వంలో ఆయుర్వేద నిపుణుల కమిటీ భేటీ అయ్యింది. ఆదివారం చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని నరసింగాపురం టీటీడీ ఆయుర్వేద ఫార్మసీలో చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, టీటీడీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మురళీకృష్ణ, ఆసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బదిరి నారాయణ, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రమేష్‌ బాబు, టెక్నికల్‌ సూపర్‌వైజర్‌ నారప రెడ్డితో కలసి సమీక్షించారు. ఈ మందు తయారీకి అవసరమైన పరికరాలు, స్థల పరిశీలన, వన మూలికల నిల్వల అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ ఆనందయ్య మందుకు ఆయుష్, ఐసీఎంఆర్‌తో పాటు ఇతర పరిశోధన సంస్థల నుంచి ఆమోద ముద్ర లభిస్తే ఆ మందు తయారీ విధానంలో టీటీడీ సైతం భాగస్వామ్యం అవుతుందన్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఆనందయ్య మందులో సైడ్‌ ఎఫెక్టŠస్‌ లేవని నిర్ధారణ అయ్యిందన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో ఈ మందును స్వయంగా 60 రోజుల్లో తయారు చేసి యావత్తు రాష్ట్రానికి అందించే సామర్థ్యం ఉందన్నారు.

అత్యాధునిక ఆయుర్వేద ఫార్మా టీటీడీ పరిధిలో ఉందన్నారు. ఈ మందు తయారీకి వినియోగించే వన మూలికలు శేషాచలం అడవిలో సమృద్ధిగా ఉన్నాయని, ఈ మందుపై నాలుగు దశల్లో లోతైన పరిశోధన జరగాల్సి ఉందన్నారు. ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందు కరోనాకు శాశ్వత విరుగుడు కాదని, ఇమ్యూనిటీని అధికం చేయగల సత్తా ఉందని తెలిసినా.. ఇమ్యూనిటీ బూస్టర్‌ కింద తయారీ చేపడతామన్నారు. మందు తయారీ, పంపిణీ సీఎం సూచనల మేరకు చేపడతామని స్పష్టం చేశారు. 

ప్రతి మూలికా ఉపయోగపడేదే 
ఆనందయ్య ఆయుర్వేద మందు తయారీలో వాడిన 18 రకాల వన మూలికల వినియోగం శతాబ్దాల కాలంగా సాగుతోందని ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్‌ మురళీకృష్ణ అన్నారు. ఇందులోని ప్రతి మూలిక ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడేదేనని చెప్పారు. ఆనందయ్య మందుపై ఆధ్యయనంలో ఎస్వీ ఆయుర్వేద కళాశాలను భాగస్వామ్యం చేశారని తెలిపారు. ముళ్ల వంకాయ గుజ్జు, జీలకర్ర, తేనెతో కలగిలిపిన మిశ్రమంతో ఆనందయ్య తయారు చేసిన డ్రాప్స్‌ వల్ల కంటికి ఎటువంటి హాని కలగదని ఆయన చెప్పారు.  

మరిన్ని వార్తలు