తిరుమలలో సర్వదర్శనం ప్రారంభం

9 Nov, 2022 06:30 IST|Sakshi
చంద్రగ్రహణం తర్వాత తిరుపతి కపిల తీర్థంలో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు

గ్రహణం అనంతరం అన్ని ఆలయాల్లో సంప్రదాయబద్ధంగా పూజలు 

అనంతరం భక్తులకు దర్శనాలు.. శ్రీకాళహస్తిలో పోటెత్తిన భక్తులు  

తిరుమల/సింహాచలం/శ్రీశైలం టెంపుల్‌/శ్రీకాళహస్తి: పాక్షిక చంద్ర గ్రహణం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మూతబడ్డ ప్రధాన ఆలయాలన్నీ గ్రహణం విమోచానంతరం సంప్రోక్షణ, ప్రదోషకాల పూజలు పూర్తయ్యాక తెరుచుకున్నాయి. రాహుకేతువులకు నిలయమైన శ్రీకాళహస్తీవ్వరాలయంలో మాత్రం స్వామిఅమ్మవార్లకు గ్రహణ కాలాభిషేకాలు చేశారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం రాత్రి 8.20 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉ.8.40 గంటలకు ఆలయం తలుపులు మూసివేశారు. రాత్రి 7.20 గంటలకు తెరిచారు. ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, రాత్రి కైంకర్యాలు నిర్వహించారు.

అనంతరం భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది. అలాగే, రాత్రి 8.30 గంటల నుంచి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమైంది. విశాఖ జిల్లా సింహాచలంలో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి ఆలయంలో రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి పూజాదికాలు నిర్వహించారు. ఇక్కడ బుధవారం ఉ.6.30 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. ఇక శ్రీశైల ఆలయంలో రాత్రి 8 గంటల నుంచి అలంకార దర్శనాన్ని మాత్రమే భక్తులకు కల్పించారు.

శ్రీకాళహస్తిలో గ్రహణ కాలాభిషేకాలు 
మరోవైపు.. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా భక్తులు పోటెత్తారు. దేశవ్యాప్తంగా ఆలయాలన్నీ మూతబడినప్పటికీ ఇక్కడి స్వామిఅమ్మవార్లకు గ్రహణ కాలాభిషేకాలు చేశారు. దీంతో దేశం నలుమూలల నుంచి స్వామివారిని భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు. సహస్ర లింగం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శాంతి అభిషేకాలు జరిపారు. రష్యా భక్తులు కూడా రాహు–కేతు పూజలు చేయించుకుని మురిసిపోయారు.   

మరిన్ని వార్తలు