సర్వదర్శనం భక్తులకు అధిక ప్రాధాన్యత

15 Apr, 2022 04:18 IST|Sakshi
ఏటీసీ వద్ద క్యూలైన్‌లో వేచి వున్న భక్తులు

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

బుధవారం అర్ధరాత్రి వరకు 88,748 మందికి శ్రీవారి దర్శనం

క్యూలైన్లో భక్తులకు ఇబ్బంది లేకుండా టీటీడీ అధికారుల చర్యలు

ఎప్పటికప్పుడు క్యూలైన్లను తనిఖీ చేస్తున్న అదనపు ఈవో

తిరుమల: కలియుగ వైకుంఠంలో టీటీడీ ఇప్పటికే బ్రేక్‌ దర్శనాలు రద్దుచేసి సర్వదర్శనం భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తోంది. కరోనాకు ముందు తిరుమలలో ఉన్న పరిస్థితులు రెండేళ్ల తరువాత కనిపిస్తున్నాయి. వారాంతాలను తలపించేలా సాధారణ రోజుల్లోనూ భక్తుల రద్దీ నెలకొంది. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని బుధవారం అర్ధరాత్రి వరకు 88,748 మంది దర్శించుకున్నారు. ఇందులో సర్వదర్శన క్యూలైన్ల ద్వారా 46,400 మంది, రూ.300 ప్రత్యేక దర్శనం క్యూలైన్‌ ద్వారా 25,819 మంది, వర్చువల్‌ సేవా టికెట్లు, సేవా టికెట్లు, టూరిజం శాఖ కేటాయింపు ద్వారా 16,529 మందికి శ్రీవారి దర్శన భాగ్యం లభించింది.

కరోనా అనంతరం భక్తుల సంఖ్య 88 వేలు దాటడం ఇదే ప్రథమం. స్వామికి బుధవారం అర్ధరాత్రి వరకు 38,558 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి హుండీ ద్వారా కానుకల రూపంలో రూ.4.82 కోట్లు లభించాయి. గురువారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి అర్ధరాత్రి వరకు క్యూ లైన్లను పర్యవేక్షించి తిరిగి గురువారం ఉదయం కూడా తనిఖీలు చేశారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్‌లో నిరంతరాయంగా అల్పాహారం, పానీయాలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.

సులభంగా సర్వదర్శనం 
సర్వదర్శనం కోసం కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు సులభతరంగా దర్శనం కల్పించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఒక క్యూలైన్లో రూ.300 ప్రత్యేక దర్శనం పంపిస్తూ, మరో క్యూలైన్లో సర్వదర్శనం భక్తులను అనుమతిస్తున్నారు.  ఎక్కువసేపు క్యూ కంపార్ట్‌మెంట్‌లలో ఉంచకుండా 3 గంటల్లో దర్శనమయ్యేలా చర్యలు చేపట్టారు. బుధవారం అర్ధరాత్రి నుంచి  వేగవంతంగా స్వామిదర్శనం లభిస్తోంది.

1,12,529 మందికి శ్రీవారి అన్న ప్రసాదం
తిరుమలలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా శ్రీవారి భక్తులకు ఎలాంటిలోటు లేకుండా టీటీడీ అన్న ప్రసాదం అందిస్తోంది. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, సీఆర్వో కార్యాలయం, రాంభగీచ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లలో మొత్తం 1,12,529 మంది భక్తులకు అన్నప్రసాదాలు, అల్పాహారాలు, పానీయాలు అందజేశారు. 

మరిన్ని వార్తలు