ఎస్వీబీసీ చానెల్‌కు హెచ్‌ఆర్‌ పాలసీ: టీటీడీ

3 Feb, 2021 19:15 IST|Sakshi

తిరుపతి: శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌కు తొలిసారి హెచ్ఆర్ పాల‌సీని ఆమోదిస్తూ ఎస్వీబీసీ బోర్డు నిర్ణ‌యం తీసుకుంది. ఉగాది సంద‌ర్భంగా ఏప్రిల్ 13వ తేదీ నుండి క‌న్న‌డ‌, హిందీ ఛాన‌ళ్ల‌ ప్ర‌సారాల ప్రారంభానికి ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌కు టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలోని ఈవో కార్యాల‌యంలో బుధ‌వారం ఎస్వీబీసీ బోర్డు స‌మావేశం జ‌రిగింది. భ‌క్తుల‌కు మ‌రింత మెరుగ్గా ప్ర‌సారాలు అందించేందుకు హెచ్‌డి ఛాన‌ల్ ప్రారంభానికి అవ‌స‌ర‌మైన ప‌రిక‌రాల కొనుగోలుకు అంచ‌నాలు రూపొందించాల‌న్నారు.

ఎస్వీబీసీ రేడియో ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. రాబోవు సంవ‌త్స‌రానికి సంబంధించిన‌ కార్య‌క్ర‌మాల ప్ర‌ణాళిక రూపొందించాల‌ని, వీటిలో భ‌క్తితోపాటు సంగీతం, సాహిత్యానికి ప్రాముఖ్య‌త ఇవ్వాల‌ని కోరారు. ఇంకా వెలుగులోకి రాని తాళ్ల‌పాక అన్న‌మ‌య్య అధ్యాత్మ‌, శృంగార సంకీర్త‌న‌లు, మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ సాహిత్యం, శ్రీ పురంద‌ర‌దాసుల కీర్త‌న‌ల‌ను ప‌రిష్క‌రించి ఎస్వీబీసీ ద్వారా భ‌క్తుల‌కు చేరువ చేయాల‌ని టీటీడీ ఈఓ సూచించారు. ఎస్వీబీసీ సోష‌ల్ మీడియా విభాగాన్ని బ‌లోపేతం చేసి ధ‌ర్మ‌ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను మ‌రింతగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఎస్వీబీసీ ప్రారంభం నుంచి హెచ్ఆర్ పాల‌సీ లేనందువ‌ల్ల ఆ విషయంపై బోర్డు సుదీర్ఘ చ‌ర్చ జరిపి ఆమోదించింది.

మరిన్ని వార్తలు