తిరుమల: శ్రీవారి బ్రేక్ దర్శనంలో మార్పులు.. రేపటి (డిసెంబర్‌ 1) నుంచే అమలులోకి!

30 Nov, 2022 04:21 IST|Sakshi

తిరుమలలో ఉదయం 8 గంటల నుంచి బ్రేక్‌ దర్శనాలు 

సామాన్య భక్తులకు తగ్గనున్న నిరీక్షణ సమయం 

నెలరోజులు ప్రయోగాత్మక పరిశీలన

తిరుమల: డిసెంబర్‌ 1వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్‌ దర్శన సమయం మారనుంది. రాత్రిపూట వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరగా స్వామి వారి దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలకమండలి. వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్లున్న భక్తులను ప్రస్తుతం ఉదయం 6 గంటలకు దర్శనానికి అనుమతిస్తున్న టీటీడీ.. గురువారం(డిసెంబర్‌ 1) నుంచి ఉదయం 8 గంటలకు అనుమతించనుంది. ప్రొటోకాల్, శ్రీవాణి ట్రస్టు టికెట్ల భక్తులను ముందుగా అనుమతిస్తారు.

స్వామికి రెండోగంట నివేదన తరువాత 10.30 గంటల నుంచి జనరల్‌ బ్రేక్‌ దర్శనం టికెట్లున్న భక్తులను, తరువాత టీటీడీ ఉద్యోగుల కుటుంబసభ్యులను దర్శనానికి అనుమతించనున్నారు. దీంతో సామాన్య భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉండే సమయం తగ్గనుంది. నెలరోజులు ఈ విధానాన్ని పరిశీలించి ఇలాగే కొనసాగించాలా, లేక పాత పద్ధతినే అమలుచేయాలా అని టీటీడీ నిర్ణయం తీసుకోనుంది.  

ఈ మేరకు బుధవారం అన్నమయ్య పాలక మండలిలో చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ పాలకమండలి భేటీ అయ్యింది. రేపటి నుంచి వీఐపీ దర్శన సమయంలో మార్పుతో పాటు ఆనంద నిలయం స్వర్ణమయం అంశంపై పాలకమండలి చర్చిస్తోంది. అం‍తేకాదు.. వసతి సమస్య నివారణ పైనా చర్చించినట్లు తెలుస్తోంది.

2014 నుంచి సాయంత్రం వీఐపీ బ్రేక్‌ దర్శనాల రద్దు  
శ్రీవారి ఆలయంలో 1994కి పూర్వం వీఐపీ బ్రేక్‌ దర్శనాలు లేవు. అప్పటివరకు భక్తులందరినీ స్వామి దర్శనానికి కులశేఖరపడి వరకు అనుమతిస్తుండడంతో వీఐపీలు ఏ సమయంలో వచ్చినా దర్శనానికి అనుమతించేవారు. ఆ తరువాత సిఫార్సు లేఖల విధానం మొదలైంది. సాయంత్రం నైవేద్య సమర్పణ తరువాత వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు అనుమతించేవారు. వీఐపీ బ్రేక్‌ దర్శనాలు కోరుకునే భక్తుల సంఖ్య పెరగడంతో టీటీడీ ఉదయం కూడా వీఐపీ బ్రేక్‌ దర్శనాలు ప్రారంభించింది.

ఈ కారణంగా సామాన్య భక్తులకు దర్శన సమయం తగ్గిపోయిందంటూ టీటీడిపై విమర్శలు రావడంతో 2012లో గురువారం మినహా మిగిలిన రోజుల్లో సాయంత్రం వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దుచేసింది. 2014 నుంచి సాయంత్రం వీఐపీ బ్రేక్‌ దర్శనాలను పూర్తిగా రద్దుచేసింది. ప్రస్తుతం ఉదయం పూట వీఐపీ బ్రేక్‌ దర్శనాలు మాత్రమే అమలవుతున్నాయి. ముందుగా ప్రొటోకాల్‌ పరిధిలోని వారిని, తరువాత శ్రీవాణి ట్రస్ట్‌కి విరాళాలు ఇచ్చినవారిని, అనంతరం సిఫార్సు లేఖలపై టికెట్లున్న భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు.

ఈ బ్రేక్‌ దర్శనాలకే మూడు నుంచి నాలుగుగంటలు పడుతుండడంతో సర్వదర్శన భక్తులు దర్శనం కోసం వేచి చూసే సమయం పెరుగుతోంది. సర్వదర్శనం క్యూ లైను ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతోంది. ముందురోజు అర్ధరాత్రి 12 గంటలకు నిలిపేసిన సర్వదర్శన క్యూ లైన్‌ తరువాత రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుండడంతో భక్తుల నిరీక్షణ సమయం పెరుగుతూ వస్తోంది.

ఆ సమయాన్ని తగ్గించేందుకు టీటీడీ దర్శన విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. వేకువజామున ఆలయం తెరిచి శ్రీవారికి  కైంకర్యాలు, నివేదనలను పూర్తిచేసిన అనంతరం సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించి, తరువాత వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లున్నవారిని దర్శనానికి అనుమతిస్తే, సామాన్య భక్తులు దర్శనానికి వేచి ఉండే సమయం తగ్గుతుందని టీటీడీ భావిస్తోంది.

దీనికితోడు వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్లున్న భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని స్వామిని దర్శించుకునే వెసులుబాటు లభిస్తుందని, దీంతో వసతి గదుల కేటాయింపు విషయంలో ఒత్తిడి తగ్గుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. నెలరోజులు పరిశీలించి ఈ విధానం అమలుపై నిర్ణయం తీసుకోనుంది.

మరిన్ని వార్తలు