ఆన్‌లైన్‌లో సెప్టెంబర్‌ నెల ఎస్‌ఈడీ టికెట్ల కోటా

8 Jul, 2022 04:41 IST|Sakshi
ఆలయం వెలుపల భక్తుల రద్దీ

తిరుమల: శ్రీవారి దర్శనానికి సంబంధించి సెప్టెంబర్‌ నెలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం(ఎస్‌ఈడీ) టికెట్లను టీటీడీ గురువారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. సెప్టెంబర్‌ నెలలో 20, 26, 27, 28, 29, 30 తేదీలు మినహా మిలిగిన రోజుల్లో భక్తులు ఎస్‌ఈడీ టికెట్లను బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించింది. గురువారం సాయంత్రానికి సెప్టెంబర్‌ మాసంలో శనివారాలు మినహా మిగిలిన రోజుల్లో ఎస్‌ఈడీ దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

ఇదిలా ఉండగా, సెప్టెంబర్‌ నెలకు సంబంధించి తిరుమలలో వసతి కోటాను శుక్రవారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదేవిధంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు జూలై 12, 15, 17 తేదీల్లో వర్చువల్‌ ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను కూడా ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. కాగా, ఈ నెల 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనంను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించనుంది.

శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమలలో గురువారమూ భక్తుల రద్దీ కొనసాగింది. బుధవారం అర్ధరాత్రి వరకు 76,418 మంది స్వామి వారిని దర్శించుకోగా.. 38,629 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.4.73 కోట్లు వేశారు. దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ పూర్తిగా నిండిపోయాయి. క్యూలైను లేపాక్షి సర్కిల్‌ వద్దకు చేరుకుంది. కాగా, శనివారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహిస్తోంది. భక్తులు తమ సందేహాలను, సూచనలను 0877–2263261 నంబర్‌కు ఫోన్‌ చేసి టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డికి తెలుపవచ్చు. 

మరిన్ని వార్తలు