ఈ నెల 8న చంద్ర గ్రహణం.. శ్రీవారి ఆలయం మూత..

4 Nov, 2022 04:26 IST|Sakshi
శ్రీవారి ఆలయం వెలుపల భక్తులు

ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు

తిరుమల: ఈ నెల 8న చంద్ర గ్రహణం కారణంగా 12 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. ఆ రోజున బ్రేక్‌ దర్శనం, శ్రీవాణి, రూ.300 దర్శనం, ఇతర ఆర్జిత సేవలను, తిరుపతిలో ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసింది. గ్రహణ సమయం ముగిసిన తర్వాత వైకుంఠం–2 నుంచి దర్శనానికి అనుమతిస్తారు. 8న మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్ర గ్రహణం ఉన్న కారణంగా ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 గంటల వరకు ఆలయ తలుపులు మూసివేస్తారు.

ఆ రోజున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ఇతర ప్రాంతాల్లో కూడా అన్నప్రసాద వితరణ ఉండదు. రాత్రి 8.30 గంటల నుంచి అన్నప్రసాద వితరణ ప్రారంభమవుతుంది.  

సర్వ దర్శనానికి 30 గంటలు 
తిరుమలలో రద్దీ అధికంగా ఉంది. 31 క్యూ కంపార్ట్‌మెంట్లు నిండాయి. సర్వ దర్శనానికి 30 గంటలు, రూ.300 దర్శనానికి 3 గంటలు పడుతోంది. బుధవారం అర్ధరాత్రి వరకు 68,995 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 29,037 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.3.71 కోట్లు వేశారు. తిరుమలలో గురువారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కాగా, శ్రీవారిని గురువారం సినీ నటుడు అల్లు శిరీష్‌ దర్శించుకున్నారు.

5న డయల్‌ యువర్‌ ఈవో 
డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం ఈ నెల 5న శనివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భక్తులు తమ సందేహాలు, సూచనలను టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి ఫోన్‌లో తెలపవచ్చు. ఇందుకుగాను 0877–2263261 నంబర్‌ను సంప్రదించాలి.  

మరిన్ని వార్తలు