బ్రహ్మోత్సవాలకు తిరునగరి ముస్తాబు

16 Sep, 2022 06:00 IST|Sakshi
ఫైల్‌

శరవేగంగా జరుగుతోన్న ఏర్పాట్లు  

ఈ నెల 20 నాటికి పూర్తి కానున్న పనులు

తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తిరుమలలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రెండేళ్ల అనంతరం బ్రహ్మోత్సవాలను ఆలయం వెలుపల నిర్వహిస్తుండటం..ఈ ఏడాది ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 27 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 20వ తేదీ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని టీటీడీ సంకల్పించింది.

శ్రీవారి వాహనసేవలు జరిగే ఆలయ మాడ వీధులతో పాటు తిరుమలను ఇప్పటికే సర్వాంగసుందరంగా తీర్చిదిద్దింది. కళ్లు చెదిరే రంగులు, విద్యుత్‌ దీప కాంతులతో తిరు వీధులను దేదీప్యమానంగా అలంకరిస్తోంది. పటిష్టమైన బ్యారికేడ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. తిరుమలలోని ప్రధాన మార్గాల్లో పలు చోట్ల భారీ ఆరీ్చలను నిర్మిస్తోంది. కాటేజీలు, కార్యాలయాలు, భక్తజన సంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో విద్యుత్‌ దీపాలు, లైటింగ్‌ కటౌట్లను ఏర్పాటు చేస్తోంది.

బ్రహ్మోత్సవ వాహన సేవల్లో అపురూపమైన కళారూపాల ప్రదర్శనకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఈ కళారూపాలు భక్తులకు కనువిందు చేయనున్నాయి. ఉత్తరాదితో పాటు దక్షిణాదికి చెందిన 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం నుంచి కళాకారులు వాహన సేవల్లో పాల్గొననున్నారు.

వాహన సేవల సమయంలో విశిష్టతను తెలియజేసేందుకు ప్రముఖ పండితులు వ్యాఖ్యానం చేస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి 9 రోజుల పాటు 16 వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. 

భక్తులకు విస్తృత ఏర్పాట్లు 
బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడంతో పాటు భక్తులకు విస్తృత ఏర్పాట్లు కల్పిస్తున్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. గురువారం ఆయన టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్‌తో కలిసి మాడ వీధుల్లోని వివిధ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను, గ్యాలరీలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది పెరటాశి మాసం, అక్టోబర్‌ 1న గరుడ సేవతో పాటు అన్ని వాహన సేవలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.  

సర్వ దర్శనానికి 18 గంటలు 
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 72,540 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 33,339 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.4.91 కోట్లు వేశారు.

వాహన సేవల సమయాల్లో మార్పు.. 
ఈ ఏడాది వాహన సేవల సమయాల్లో టీటీడీ పలు మార్పులు చేసింది. గతంలో ప్రతి వాహన సేవ ఉదయం, రాత్రి వేళల్లో 9 గంటలకు ప్రారంభమయ్యేది. ఈ సారి నుంచి ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకే వాహన సేవలను ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. 26న సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది.

27న సాయంత్రం 5.15 నుంచి 6.15 గంటల వరకు శ్రీవారికి ధ్వజారోహణ నిర్వహించడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు సాయంత్రం 7గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీవారికి పట్టు వ్రస్తాలు సమర్పిస్తారు. రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే పెద్ద శేషవాహనంతో బ్రహ్మోత్సవ సంబరం మొదలవుతుంది. 

మరిన్ని వార్తలు